చీఫ్ బ్రేకప్ ఆఫీసర్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. ఇదేం జాబ్ గురూ?

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి.

Update: 2026-06-29 01:56 GMT

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి సాంప్రదాయ ఉద్యోగాలకే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ మీడియా విస్తరణతో ఊహించని కొత్త రకాల కొలువులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక విభిన్నమైన, వింతైన ఉద్యోగ ప్రకటన నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ డేటింగ్. కామ్ తాజాగా "చీఫ్ బ్రేకప్ ఆఫీసర్" అనే పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వినూత్న ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు ఈ 'చీఫ్ బ్రేకప్ ఆఫీసర్' పని ఏంటి?

సాధారణంగా ఒక బంధంలోకి అడుగుపెట్టడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. ఆ బంధం సరిగ్గా సాగనప్పుడు దాని నుంచి విడిపోవడం అంతకంటే ఎక్కువ మానసిక వేదనను మిగులుస్తుంది. ఇక్కడే ‘చీఫ్ బ్రేకప్ ఆఫీసర్’ పాత్ర మొదలవుతుంది. ఒక క్లయింట్ తన ప్రేమ బంధాన్ని లేదా రిలేషన్‌షిప్‌ను ముగించాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆ విషయాన్ని వారి భాగస్వామికి మర్యాదపూర్వకంగా, సున్నితంగా తెలియజేయడమే ఈ ఉద్యోగి ముఖ్య విధి. బ్రేకప్ సమయంలో ఎలాంటి పెద్ద గొడవలు, అపార్థాలు లేదా మానసిక ఉద్రిక్తతలు తలెత్తకుండా సంభాషణను నడపాలి. అవతలి వ్యక్తి మనోభావాలు దెబ్బతీయకుండా, అత్యంత సానుభూతితో పరిస్థితిని వివరించే నేర్పు ఈ ఆఫీసర్‌కు ఉండాలి.

అర్హతలు వింతగా ఉన్నాయేంటి గురూ?

ఈ ఉద్యోగానికి కంపెనీ ఆఫర్ చేస్తున్న జీతం అక్షరాలా నెలకు సుమారు రూ.2.8 లక్షలు. అయితే ఈ భారీ ప్యాకేజీని అందుకోవడానికి అకడమిక్ డిగ్రీల కంటే జీవిత అనుభవానికే సంస్థ ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం డేటింగ్.కామ్ ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి జీవితంలో కనీసం మూడు బ్రేకప్స్ అయిన అనుభవం ఉండాలని స్పష్టం చేసింది. "సొంత జీవితంలో బ్రేకప్స్ చూసిన వారికి మాత్రమే.. ప్రేమ సంబంధాలు విచ్ఛిన్నమైనప్పుడు ఎదురయ్యే మానసిక సంఘర్షణ, భావోద్వేగాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే ఈ విచిత్రమైన అర్హతను నిర్ణయించాం" అని సంస్థ పేర్కొంది.

ఈ సేవలు ఎందుకు అవసరమయ్యాయి?

ఈ వినూత్న ఉద్యోగాన్ని ప్రవేశపెట్టడం వెనుక బలమైన కారణమే ఉందని డేటింగ్.కామ్ వెల్లడించింది. నేటి కాలంలో చాలా మంది వ్యక్తులు తమ భాగస్వామితో బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేకపోయినా.. ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక, అవతలి వ్యక్తి ఎక్కడ బాధపడతాడో అనే భయంతో అయిష్టంగానే రిలేషన్‌లో ఉండిపోతున్నారు. దీనివల్ల ఇద్దరిలో తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి వారి ఒత్తిడిని తగ్గించి, ఎంతో గౌరవప్రదంగా, ప్రశాంతమైన వాతావరణంలో సంబంధాన్ని ముగించేందుకు ఈ సేవలు ఎంతగానో దోహదపడతాయని సంస్థ భావిస్తోంది.

నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే?

ఈ జాబ్ నోటిఫికేషన్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కాగానే నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు "బ్రేకప్స్ వల్ల కూడా ఉద్యోగాలు వస్తాయా? బాబోయ్.. ఇది కూడా ఒక ఉద్యోగమేనా!" అంటూ ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం "ప్రస్తుత యాంత్రిక జీవనంలో పెరిగిపోతున్న రిలేషన్‌షిప్ సమస్యల దృష్ట్యా ఇలాంటి సేవలు నిజంగానే అవసరం" అని మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వింతైన హ్యూమన్ రిలేషన్స్ ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News