బాబు నినాదం జనంలోకి ఎక్కుతోందా ?

దేశంలో పరిస్థితులు మారాయని ఇపుడు సంతానం భారం కాదు అని బాబు చెప్పారు. సంతానాన్ని సమస్యగా చూసే విధానం పోవాలని ఆయన కోరారు.

Update: 2026-06-29 03:49 GMT

ఎక్కువ మంది పిల్లలను కనమని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఆయన ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. పైగా ఇటీవల నీతి అయోగ్ మీటింగులో కూడా జాతీయ పాలసీని తయారు చేసే విషయం పరిశీలించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. బాబు తాను ఏపీలో నిర్వహించే ప్రతీ సమావేశంలోనూ ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. అధిక సంతానమే ముద్దు అదే అసలైన సంపద అని కూడా బాబు చెబుతున్నారు. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మళ్లీ ఈ నినాదాన్ని వినిపించారు.

సంతానం భారం కాదు :

దేశంలో పరిస్థితులు మారాయని ఇపుడు సంతానం భారం కాదు అని బాబు చెప్పారు. సంతానాన్ని సమస్యగా చూసే విధానం పోవాలని ఆయన కోరారు. నిజానికి చూస్తే సంతానం అంటే సంపద అని బాబు కొత్త నిర్వచనం చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తోందని బాబు అన్నారు. అందుకే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని బాబు చెప్పారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా ఏపీలో చేపడతున్నట్లుగా బాబు తెలిపారు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలి :

ఇదిలా ఉంటే మళ్లీ పాత రోజులు రావాలని బాబు అంటున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని ఆయన కోరుకున్నారు. పిల్లల్ని కని పెంచడం వారి అలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చంద్రబాబు చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో అందరూ భాగస్వాములు అయ్యేవారని ఆయన గుర్తు చేశారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు తాతయ్యలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని బాబు గుర్తుచేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని ఆయన అభివర్ణించారు. అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని అంటున్నారు. ఇక పిల్లల పెంప్కంలో తండ్రి కూడా కీలక పాత్ర పోషించాలని బాబు కోరారు.

యువతరం ఏమంటోంది :

చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక కుటుంబ పెద్దగా ఏపీ మొత్తం సమాజానికి విలువైన సూచనలు చేస్తున్నారు. నిజంగా ఆయన చెప్పిన విషయాలు ఆలోచించాల్సినవే. ఒక వైపు ప్రపంచంలో జననాల రేటు తగ్గుతోంది. కొన్ని దేశాలకు ఇదే సమస్య అవుతోంది. ఏపీలో సైతం సంతానోత్పత్తి తగ్గుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. అందుకే బాబు పిల్లలను కనమని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో యువత ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదే చర్చగా ఉంది. యువతరం చూస్తే కనుక పెళ్ళిన విషయంలోనే విముఖంగా ఉంది.

వారిది ఆర్ధిక సమస్య :

తీరా వివాహం చేసుకున్నా ఇపుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు. ఆ మీదట ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. చదువుకున్న యువత పట్టణాలలో ఉన్న వారిలో ఈ పరిస్థితి ఉంటే గ్రామీణ యువత కూడా పిల్లలు అధికంగా ఉంటే పెంచలేమని ఆలోచిస్తునారు. వారిది ఆర్ధిక సమస్య. అయితే పట్టణ నగర హ్యువతది బంధనాల సమస్య. మొత్తం మీద ముంచుకొస్తున్న జనాభా తగ్గుదల ముప్పు అయితే ఎవరూ సరిగ్గా గమనించడం లేదు, చూద్దామన్న వైఖరితోనే ఉంటున్నారు. మరి బాబు నినాదం ఏ మేరకు ఫలిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News