చావుకు భయపడేది లేదు....బంగ్లాకు షేక్ హసీనా !

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తాను అని సంచలన ప్రకటన చేశారు.

Update: 2026-06-29 04:05 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తాను అని సంచలన ప్రకటన చేశారు. తాను చావు ఎదురైన వెనక్కి తగ్గేది లేదని ఆమె అన్నారు. తన జీవితంలో ఎన్నో రకాలైన దాడులు ఎదుర్కొన్నాను అని ఆమె చెప్పారు. అందువల్ల ఈ ఏడాదిలోనే తాను బంగ్లాదేశ్ లో అడుగుపెట్టడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక జాతీయ వాతా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ళ క్రితం ఇండియాకు :

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టు 5న విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా దేశం విడిచి ఇండియా రావాల్సి వచ్చింది. ఆమె అప్పటి నుండి భారతదేశంలో ప్రవాసంలో నివసిస్తున్నారు. ఆమె ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తీవ్రమైన రాజకీయ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో భారతదేశంలో కట్టుదిట్టమైన భద్రతతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన పూర్తి భద్రతతో న్యూఢిల్లీలోనే ఆమె ఉంటున్నారు.

షేక్ హసీనాకు మరణశిక్ష :

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ షేక్ హసీనా పాలనలో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయని అలాగే అవినీతితో సహా పలు అభియోగాలపై షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఢాకాలో అధికార ప్రభుత్వం భారత్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా ఆమెను అప్పగించాలని పలుమార్లు అధికారికంగా అభ్యర్థించింది. అయితే షేక్ హసీనాను అప్పగించే విషయంలో భారతదేశం దౌత్యపరమైన సందిగ్ధతను ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, చట్టపరమైన ఒప్పందం ఒకవైపు దీర్ఘకాలంగా ఉన్న భద్రతా సంబంధాలు, కూటమి బాధ్యతలు మరోవైపు ఉండేలా సమతుల్యం చేసుకోవాల్సి వస్తోంది. ఆమెపై నేరారోపణలు రుజువైనప్పటికీ, రాజకీయ న్యాయపరమైన విచారణలను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే తన ఉద్దేశాన్ని షేక్ హసీనా తాజాగా ప్రకటించడం విశేషం.

అవామీ లీగ్ ఒక శక్తి :

తన పార్టీ అవామీ లీగ్ ఒక శక్తిగా షేక్ హసీనా అభివర్ణించారు. అవామీ లీగ్ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సార్లు దాడులకు గురైందని ఆమె గుర్తు చేశారు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా ప్రజలకు పునరంకితం అయింది అని గుర్తు చేశారు. ఇక తన జీవితం గురించి తెలియచేస్తూ 1975లో తన తల్లిదండ్రులతో పాటు మొత్తం కుటుంబాన్ని తాను పోగొట్టుకున్నా వెనక్కి తగ్గినది లేదని చెప్పారు. తాను ఏకంగా అయిదు సార్లు బంగ్లా దేశ్ ప్రధానిగా పనిచేశాను అని ప్రజల అభిమానం కారణంగానే అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాను ఏనాడూ అధికారం కోసం రాజకీయాలు చేయలేదని ఆమె అన్నారు. తనపైన రాజకీయ ప్రతీకారంతోనే దాడులు చేస్తున్నారని న్యాయ వ్యవస్థను వాడుకున్నారని ఆమె ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటివి విఫలం అయ్యాయని షేక్ హసీనా పేర్కొన్నారు. ఇపుడు కూడా అదే జరుగుతుందని అన్నారు.

ప్రజలకే జీవితం :

తన జీవితం మొత్తం బంగ్లా ప్రజలకే అంకితం చేశాను అని షేక్ హసీనా చెప్పారు. గతంలో ఎలా ప్రతీ ఇబ్బందిని ఎదుర్కొని ముందుకు సాగామో ఇపుడూ అదే చేస్తామని అన్నారు. అందుకే తాను సొంత దేశానికి తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను అని ఆమె స్పష్టం చేశారు. ప్రజల హృదయాలలో అవామీ లీగ్ పార్టీ ఉందని ఆమె అన్నారు. అందువల్ల రానున్న కాలంలో తమ పార్టీ జనం నుంచే పునరుజ్జీవం పొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని విధాలుగా విఫలం :

ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పాలన అన్ని విధాలుగా విఫలం అయిందని ఆమె అన్నారు. ప్రజాస్వామిక చట్టబద్ధమైన పాలన అన్నది లేదని ఆమె విమర్శించారు. తమ పార్టీ బలం చూసి ప్రస్తుతం ప్రభుత్వం భయపడుతోందని షేక్ హసీనా అన్నారు. అందుకే అవామీ లీగ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా అడ్డుకుందని ఇది ప్రభుత్వం వీక్ నెస్ అని ఆమె ఎత్తి చూపించారు. బంగ్లా దేశ్ జైలులో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తప్పుడు కేసులు ఉప సంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతే కాదు శాంతియుతమైన రాజకీయ కార్యకలాపాలను అనుమతించాలని అన్నారు.

మైనారిటీలకు అండగా :

బంగ్లా దేశ్ 1971లో ఏర్పాటు అయింది అంటే హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు, అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా మద్దతు ఇవ్వబట్టే అని ఆమె అన్నారు. లౌకిక బంగ్లాదేశ్ కోసం నాడు ప్రజలు నిలిచారు అని గుర్తు చేశారు. ఇపుడు అంటువంటి వాతావరణం పాడు చేస్తున్నారు అని అన్నారు. మైనారిటీ కుటుంబాలు భయంతోనే బంగ్లాలో జీవిస్తున్నాయని షేక్ హసీనా అంట్లూ ఇది బంగ్లాదేశ్‌కు తీరని అవమానకరమని అన్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా ఎపుడు బంగ్లా దేశ్ కి వెళ్తారు వెళ్తే ఆమె పైన ఉన్న కేసులు సంగతి ఏమిటి అన్నది చర్చగా ఉంది.

Tags:    

Similar News