చేతులు కాలాక.. బిల్ గేట్స్ పశ్చాత్తాపం..
దశాబ్దాల కాలంగా 'మానవతావాది'గా వెలుగొందుతున్న గేట్స్ ప్రతిష్ట, ఈ వివాదంతో మరోసారి మసకబారింది.;
"ఎప్‌స్టీన్‌తో గడిపిన ప్రతి క్షణం ఇప్పుడు నాకు పశ్చాత్తాపమే.. అప్పట్లో అతడి అసలు ముఖరూపం నాకు తెలియదు" అంటూ మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా 'మానవతావాది'గా వెలుగొందుతున్న గేట్స్ ప్రతిష్ట, ఈ వివాదంతో మరోసారి మసకబారింది.
ముదిరిన 'ఎప్‌స్టీన్' వివాదం
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణంలో బిల్ గేట్స్ పేరు రావడం కొత్తేమీ కాదు. అయితే అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన 30 లక్షల పేజీల విచారణ ఫైల్స్ ఈ వివాదాన్ని మళ్ళీ ముదిరేలా చేశాయి. ఈ ఫైల్స్‌లో గేట్స్‌కు సంబంధించి దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి రావడంతో ఆయన ఆస్ట్రేలియా మీడియా వేదికగా తన వివరణ ఇచ్చారు.
ఆరోపణలేంటి? గేట్స్ వాదన ఏంటి?
ఎప్‌స్టీన్ రాసుకున్న ఒక పాత ఈ-మెయిల్ (2013) ఆధారంగా ఈ విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చాయి. గేట్స్‌కు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయని.. ఆ క్రమంలో ఆయనకు కొన్ని వ్యాధులు సోకాయని ఎప్‌స్టీన్ తన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ విషయం తన భార్య మెలిందాకు తెలియకుండా ఉండటం కోసం గేట్స్ రహస్యంగా యాంటీబయాటిక్స్ అడిగారని ఆ ఫైల్స్ సారాంశం. ఈ ఆరోపణలను గేట్స్ తీవ్రంగా ఖండించారు. "ఆ ఈ-మెయిల్‌లో ఉన్నవన్నీ పచ్చి అబద్ధాలు. ఏదో రకంగా నన్ను ఇరికించాలని ఎప్‌స్టీన్ ప్రయత్నించాడా అన్న అనుమానం కలుగుతోంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెలిందా ఘాటు రియాక్షన్
ఈ మొత్తం వ్యవహారంపై గేట్స్ మాజీ భార్య మెలిందా స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. వారి 30 ఏళ్ల వైవాహిక బంధం 2021లో ముగియడానికి ఎప్‌స్టీన్‌తో గేట్స్‌కు ఉన్న సాన్నిహిత్యమే ప్రధాన కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని బలపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. "నా వివాహ జీవితంలో ఎన్నో చేదు నిజాలు ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది బిల్ గేట్స్ మాత్రమే. నేను కాదు. ఈ కేసులో బాధిత మహిళలకు న్యాయం జరగాలి" అని మెలిందా కుండబద్ధలు కొట్టారు.
పశ్చాత్తాపమా? నష్టనివారణా?
ఎప్‌స్టీన్‌తో ఆరేళ్ల పాటు స్నేహం కొనసాగించిన బిల్ గేట్స్ ఇప్పుడు అది తన జీవితంలో అతిపెద్ద తప్పు అని ఒప్పుకుంటున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం దీన్ని "ఆలస్యమైన నష్టనివారణ చర్య" గా అభివర్ణిస్తున్నారు. ఒకవైపు ప్రపంచం మెచ్చే దాతగా ఉంటూనే మరోవైపు వివాదాస్పద వ్యక్తులతో స్నేహం చేయడం గేట్స్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ పశ్చాత్తాపం ఆయన ఇమేజ్‌ను కాపాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఎప్‌స్టీన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ ప్రపంచ కుబేరుల ముసుగులు తొలుగుతున్నాయి. బిల్ గేట్స్ ఇప్పుడు ఎన్ని క్షమాపణలు కోరినా విడిపోయిన బంధం కానీ దెబ్బతిన్న ప్రతిష్ట కానీ తిరిగి రావడం కష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.