మోడీపై లోక్ సభలో దాడికి ప్లాన్...నిజమేనా ?
ఇక ఎన్నడూ లేని విధంగా లోక్ సభలో ఈసారి ఒక కొత్త సంప్రదాయం సాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు అంతా మాట్లాడిన తరువాత ప్రధాని మాట్లాడిన అనంతరం తీర్మానం మీద ఓటింగ్ ఉంటుంది.;
బలమైన ప్రధానిగా మూడు సార్లు నెగ్గిన నేతగా ఉన్న నరేంద్ర మోడీ మీద నిండు లోక్ సభలోనే దాడికి పధక రచన జరిగిందా, అందుకేనా మోడీ లోక్ సభకు దూరంగా ఉండిపోయారు, ఇపుడు ఈ ప్రశ్నలు అందరికీ కలుగుతున్నాయి. దానికి కారణం కూడా ఉంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లోక్ సభలో మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష ఎంపీల అనాగరిక ప్రవర్తన కారణంగా ధన్యవాద తీర్మానంపై తన సమాధానం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు రాలేకపోయారని అన్నారు.
తన సలహా మేరకే :
అంతే కాదు లోక్‌సభలో ప్రధానమంత్రి సీటు ముందుకి వచ్చి కాంగ్రెస్ ఎంపీలు అనూహ్యమైన సంఘటనను సృష్టించవచ్చని సూచించే విశ్వసనీయ సమాచారం తన వద్ద ఉన్నందువల్లనే ధన్యవాద తీర్మానంపై ప్రధాని
సమాధానం ఇవ్వడానికి సభకు రావద్దని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. అలాంటి అనూహ్యమైన పరిస్థితిని నివారించడానికి సభకు రావద్దని తాను ప్రధానమంత్రిని కోరినట్లు బిర్లా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏమిటీ అనూహ్యమైన పరిస్థితి దాని వెనక ఏముంది, ఎవరున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
విపక్షాల వైఖరి అంటూ :
బుధవారం లోక్ సభలోనూ తన ఛాంబర్‌లో విపక్ష ఎంపీల ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలు మర్యాదలకు అనుగుణంగా లేదని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ప్రతిపక్షాల ప్రవర్తనను పార్లమెంటరీ చరిత్రలో ఒక మాయని మచ్చగా ఆయన అభివర్ణించారు. సభలో గందరగోళం సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే మోడీ సభలో ప్రసంగించే సమయంలో ఆయన మీద దాడి చేసేందుకు ప్లాన్ చేశారు అని లోక్ సభ వర్గాలు కూడా చెబుతున్నారు. దాని కోసం మోడీ సీటు దగ్గరకు మహిళా ఎంపీలను పంపించారని చెబుతున్నారు.
చుట్టు ముట్టి మరీ :
ఇక ఎన్నడూ లేని విధంగా లోక్ సభలో ఈసారి ఒక కొత్త సంప్రదాయం సాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు అంతా మాట్లాడిన తరువాత ప్రధాని మాట్లాడిన అనంతరం తీర్మానం మీద ఓటింగ్ ఉంటుంది. ఆ విధంగా ఆమోదం పొందుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు, దానిని కారణం మోడీ లోక్ సభకు రాలేదు, దాంతో మూజువాణీ ఓటుతోనే తీర్మానం ఆమోదించరు. అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే మోడీని చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా చెబుతున్నారు.
రోజుకీ రెండు కేజీల తిట్లు :
ఇక రాజ్యసభలో మాట్లాడిన మోడీ తాను రోజుకు రెండు కేజీల తిట్లు తింటున్నాను అని అదే తన ఆరోగ్య రహస్యం అన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ మీద ఆయన తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు తన సమాధి అంటూ కాంగ్రెస్ వారు నినాదాలు చేస్తున్నారు అని అది వారి వల్ల అయ్యేది అసలు కానే కాదని ఆయన అన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దుకోవడానిక తమకు సమయం చాలడం లేదని మోడీ విమర్శించారు. ప్రపంచంలో భారత్ ఒక శక్తిగా ఎదుగుతోందని దానిని తట్టుకోలేకనే కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది అని నిందించారు.
స్పీకర్ చాటునే అంటూ :
మరో వైపు చూస్తే మోడీ మీద దాడి అంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఖండించారు. లోక్ సభకు వచ్చి ప్రసంగం చేయాల్సిన ఆయన ధైర్యం చాలకనే స్పీకర్ సీటు వెనక దాక్కుంటున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రియాంకా గాంధీ. నరేంద్ర మోడీ సభకు వచ్చి అనేక విషయాలకు జవాబు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది అని ఆమె అన్నారు. మొత్తానికి చూస్తే కనుక మోడీ మీద దాడి అన్నది నిజమేనా అన్నది అంతా ఆలోచిస్తున్న విషయం. ఏది ఏమైనా నువ్వా నేనా అన్నట్లుగా అత్యున్నత సభలో అధికార కాంగ్రెస్ పక్షాలు రెండూ బిగుసుకుని కూర్చున్నాయని అంటున్నారు.