7 నెలల తర్వాత అలా బయటకు రాగానే ఇలా అరెస్ట్.. ఎవరీ వైసీపీ కిషోర్!

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడినవారిపై కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-07-30 14:57 GMT

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడినవారిపై కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పలువురు నేతలు శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండగా.. మరికొంతమంది ఇటీవల వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో అలా జైలుకు వెళ్లి, బెయిల్ పై వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మళ్లీ అరెస్టైన ఓ కేసు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... వైసీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ కేసులు, అరెస్టుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... కిషోర్‌ పై ఇప్పటికే నమోదైన పలు కేసుల్లో కోర్టులు బెయిల్‌ మంజూరు చేయడంతో.. తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు! అయితే.. అలా జైలు నుంచి విడుదలయ్యారో లేదో.. కుటుంబ సభ్యుల ముందు ఇలా పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.

వాస్తవానికి కిషోర్ జైలు నుంచి విడుదలవుతారని తెలియడంతో.. ఆయన కుటుంబసభ్యులు గుంటూరు జైలు వద్దకు వచ్చారు. ఈ సమయంలో ఆయన బయటకు రాగానే కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సమయంలో.. తన భార్య, ఏడేళ్ల కుమార్తెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు! సరిగ్గా ఈ సమయంలోనే ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా.. ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో... కిషోర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.. కిషోర్‌ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదన్నారు. అయితే వారిని పోలీసులకు పక్కకు తప్పించి.. కిషోర్‌ ను తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా జైలు దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. రెంటచింతలలో టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన ఘటనలో నమోదైన కేసులో పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

కాగా... మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తురకా కిషోర్ అనుచరుడిగా ఉన్నారు. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతడిపై మొత్తం 12 కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. వీటిలో 11 హత్యాయత్నం కేసులు కాగా.. ఒకటి పీడీయాక్ట్‌! ఈ క్రమంలో పీడీ యాక్ట్‌ ను కోర్టు కొట్టేయగా.. మిగిలిన కేసుల్లో తాజాగా బెయిల్ వచ్చిందని అంటున్నారు.

ఈ క్రమంలో... కిషోర్‌ పై మరోకేసు నమోదవ్వడంతో తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా జైలు దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది.

ఇక... గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమ ల కారుపై ఓ పెద్ద కర్రతో పొడిచి దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సమయంలోనే తురకా కిషోర్ పేరు తెరపైకి వచ్చింది! అయితే.. ఆ ఘటన తర్వాత కిషోర్‌ కు మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కడం గమనార్హం!

Tags:    

Similar News