కాంగ్రెస్ ఆరా: కేసీఆర్ కు సింపతీ పెరుగుతుందా?
తెలంగాణలో ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు.;
తెలంగాణలో ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నెల 11న ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రత్యక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ఆదివారం విచారించారు. అయితే.. దీనికి ముందు.. ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ.. వార్తలు వచ్చాయి. ఎక్కడైతే.. తెలంగాణ ఉద్యమం కోసం తాను పధక రచన చేశారో.. అక్కడే పోలీసులతో విచారణకు గురికావాల్సి వచ్చిందని కేసీఆర్ భావించారు.
ఇక, సిట్ అధికారులు కూడా.. సుదీర్ఘంగా 5 గంటలకుపైగా కేసీఆర్‌ను విచారించారు. అయితే.. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. ఇక, హైదరాబాద్ లో హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జహం గీర్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలు దేరారు. మొత్తంగా ఆదివారం రాష్ట్రంలో ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది.
ఇక, కేసీఆర్ తన విచారణను పూర్తి చేసుకుని బయటకు వచ్చాక.. కార్యకర్తలకు అభివాదం చేసినప్పుడు.. జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనించింది. సిట్ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌కు సింపతీ పెరుగుతుందా? వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందా? అనే అంశాలపై పార్టీ నాయకులు చర్చించారు. అయితే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
కేసీఆర్ వ్యూహం..
ఇక, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరింత గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. సిట్ విచారణ... బీఆర్ ఎస్ నేతలపై వేధింపులు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూ డా ఆయన సూచించారు. ముఖ్యంగా సెంటిమెంటును రాజేసే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. సిట్ విచారణ అనంతరం.. గంట పాటు ఆయన పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వ్యూహాలపై చర్చించారు.