రాజమహేంద్రవరంలో దారుణ ఘటన.. మద్యం మత్తులో విద్యార్థుల దుశ్చర్య, మెడికో బ్రెయిన్ డెడ్

ప్రశాంతమైన గోదావరి తీరంలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరంలో మెడికల్ పీజీ చదువుతున్న విద్యార్థినిపై హత్యాయత్నం పెను సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-08-06 12:55 GMT

ప్రశాంతమైన గోదావరి తీరంలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరంలో మెడికల్ పీజీ చదువుతున్న విద్యార్థినిపై హత్యాయత్నం పెను సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మూడు రోజుల క్రితం నాటి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారని చెబుతున్నారు. మద్యం మత్తులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కారు ముందు స్క్రూటీతో వెళుతున్న వైద్య విద్యార్థిని ఢీకొట్టడంతోపాటు ఆమె తలపై నుంచి కారు ఎక్కించడంతో బ్రెయిన్ డెడ్ కు గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులు ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించారని పోలీసుల విచారణలో బయటపడిందని చెబుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మెడికల్ విద్యార్థినిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడమే కాకుండా రెండు మూడు సార్లు కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించడం, చివరికి దిచక్రవాహనంపై నుంచి ఆమె పడిపోగా, కారు విద్యార్థిని తలపై నుంచి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైందని పోలీసులు తెలిపారు. ఘటనపై తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. మానవత్వం లేకుండా విద్యార్థినిపై కారును ఎలా ఎక్కించారంటూ మండిపడుతున్నారు.

రాజమహేంద్రవరంలో జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చదువుతున్న ప్రియాంక (28) స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాద్ ఆదిత్య మాల్‌కు ఈ నెల 3న రాత్రి వెళ్లారని చెబుతున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకులను లోపలికి అనుమతించలేదని చెబుతున్నారు. సిబ్బంది తమను అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువకులు, మాల్ వద్ద నానా హంగామా సృష్టించడమే కాకుండా, కోపంతో వెనుదిరిగి వెళ్లే ప్రయత్నంలో మాల్ నుంచి స్కూటీపై బయటకు వస్తున్న మెడికో ప్రియాంకను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. మాల్ ప్రధాన గేటు వద్ద ఒకసారి కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆమె ముందుకు వెళుతుండగా రెండుమూడు సార్లు ఢీకొట్టి ఆమె కిందపడిపోయిన తర్వాత తలపై నుంచి కారు వేగంగా నడపడంతో తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రమైన బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తలకు తీవ్ర గాయమవడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. అత్యంత పాశవికంగా ఉన్న ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై కేసు నమోదు చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు, నిందితులు రాజమండ్రి పరిసర ప్రాంతమైన నామవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ ఘటనపై దర్యాప్తును మరింత తీవ్రతరం చేశారు.

Tags:    

Similar News