సిక్కోలు వద్ద తీరం దాటనున్న పెను తుఫాను

భారీ వాయు గుండం కాస్తా తుఫాన్ గా మారి ఉత్తరాంధ్ర మీదనే తన ప్రభావం గట్టిగా చూపిస్తోంది. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలు భారీ నుంచి అతి భారీ వానలతో జలమయం అవుతున్నాయి.

Update: 2026-09-23 17:24 GMT

భారీ వాయు గుండం కాస్తా తుఫాన్ గా మారి ఉత్తరాంధ్ర మీదనే తన ప్రభావం గట్టిగా చూపిస్తోంది. గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలు భారీ నుంచి అతి భారీ వానలతో జలమయం అవుతున్నాయి. మొదట అనుకున్న ప్రకారం తుఫాన్ దక్షిణ ఒడిషా వద్ద ఉన్న గోపాల్ పూర్ లో తీరం దాటాల్సి ఉంది. అయితే తుఫాన్ దిశ మార్చుకోవడమే కాదు ఏపీ నుంచే తీరం దాటడం ఇపుడు సర్వత్రా కలవరం రేకెత్తిస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర అంతటా తుఫాన్ ప్రభావితమైన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది అని అంటున్నారు.

కరిపేట బీచ్ వద్ద :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా వ‌జ్ర‌పుకొత్తూరు నుంచి భోగాపురం మ‌ధ్య సంతబొమ్మాళి మండలం కరిపేట బీచ్ వద్ద పెను తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో పాటు తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 60 నుంచి 70 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచ‌లున్నాని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ తీరం దాటడంతో ఆ జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మరింతగా పడే అవకాశం ఉంది అని అంటున్నారు. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.

బీభత్సమే :

ఇదిలా ఉంటే తుఫాన్ తీరం దాటే సమయంలో బీభత్సమైన పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. బలంగా వీచే గాలులతో పాటు అతి భారీ వర్షాలతో సమీప ప్రాంతాలు పెను తాకిడికి గురి అవుతాయని అంటున్నారు. తుఫాన్ తీరం దాటినప్పటికి అతి భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరో నలభై గంటలుపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు.

ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు :

ఎడతెరిపి లేకుండా ఉత్తరాంధ్రలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం శ్రీకాకుళంలో 3, అల్లూరి 2, విశాఖ 2, పోలవరం1, అనకాపల్లిలో ఒకటి మొత్తంగా 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉన్నట్లుగా అధికారులు చెప్పారు.

మరో రోజు సెలవు :

ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాలలో మరో రోజు అంటే ఈ నెల 24న కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. గురువారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలో కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News