భోగాపురం టూ డిల్లి...ఎంత ఎదిగిపోయింది !
భోగాపురం లో ఎర్ర బస్సు కూడా ఆగదు, ఆపాలంటే ముందుగా డ్రైవర్ ని కండక్టర్ ని ప్రయాణీకులు రిక్వెస్ట్ చేసుకోవాలి.
భోగాపురం లో ఎర్ర బస్సు కూడా ఆగదు, ఆపాలంటే ముందుగా డ్రైవర్ ని కండక్టర్ ని ప్రయాణీకులు రిక్వెస్ట్ చేసుకోవాలి. అలాంటి భోగాపురం కాస్తా ఇపుడు ఎంతగా ఎదిగిపోయింది అని అంతా ఆశ్చర్యపోతున్నారు. భోగాపురం నుంచి నేరుగా ఢిల్లీకి విమానం ఎగురుతోంది. అంటే ఉత్తరాంధ్రా లోని ఒక మారుమూల ప్రాంతం నుంచి దేశ రాజధానికి డైరెక్ట్ గా కనెక్షన్ ఏర్పడబోతోంది అన్న మాట. అభివృద్ధి అంటే ఇదే కదా అని అంతా అంటున్న నేపథ్యం ఇది. ఇక్కడ మరో విషయం ఉంది. నిన్నటి దాకా విశాఖ ఎయిర్ పోర్టు ఉంది. కానీ మూడేళ్ళ నుంచి విశాఖ టూ ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ ఆగిపోయింది. దానిని భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి అనుసంధానం చేయడంతో ఉత్తరాంధ్ర వాసుల ఢిల్లీ ప్రయాణం మరింత సుఖవంతంగా సాఫీగా సాగనుంది అని అంటున్నారు.
ఆ రోజు నుంచే నట :
ఇక భోగాపురం నుంచి ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ ఎగిరేది అక్టోబర్ 25 నుంచి అని చెబుతున్నారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానుండగా ఆ రోజు ఉదయం 5:55 కు డిల్లీలో భోగాపురానికి తొలి విమానం ఎగురుతుంది. ఆ విమానం భోగాపురం ఎయిర్ పోర్టులోకి ఉదయం 8:20 కి ల్యాండ్ అవుతుంది. మళ్ళీ భోగాపురంలో అదే రోజు ఉదయం 9:05 నిమిషాలకు ప్రారంభమై 11:30 కు తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. అంటే భోగాపురం నుంచి కేవలం రెండున్నర గంటలలో దేశ రాజధానికి ఈ ఎయిర్ పోర్టు వెళ్తుంది అన్న మాట. ఇది వ్యాపారులకు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలు, ప్రజా ప్రతినిధులు ఉన్నత వర్గాలు అధికారులకు ఎంతగానో మేలు చేసే సర్వీస్ గా చెబుతున్నారు. అంతే కాదు ఢిల్లీకి అర్జంట్ గా వెళ్లాలి అనుకుంటే కనుక భోగాపురం నుంచి హ్యాపీగా జర్నీ చేయవచ్చు అని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రకు మరిన్ని సేవలు :
భోగాపురం ఎయిర్ పోర్టు ఆగస్ట్ 1న ప్రారంభం అయింది. ఢిల్లీకి ఇపుడు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. రానున్న కాలంలో భోగాపురం విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన రంగం పర్యాటకం వాణిజ్యం ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆకాశ ఎయిర్ తిరిగి విశాఖపట్నం ప్రాంతంలో తన విమాన సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. అదే విధంగా భోగాపురం విమానాశ్రయం అభివృద్ధితో ఉత్తరాంధ్రను దేశంలోని వివిధ ప్రాంతాలతో మెరుగైన వైమానిక కనెక్టివిటీతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రాంతంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు గమ్యస్థానాల సంఖ్యను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
కేరాఫ్ భోగాపురం :
ఇక మీదట భోగాపురం అభివృద్ధికి కేరాఫ్ అవుతుందని అంతా అంటున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కావడంతో శర వేగంగా ప్రగతికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అలాగే వరసగా జాతీయ అంతర్జాతీయ సర్వీసులు పెంచుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో మొత్తం కీలకమైన గమ్యస్థానాలు అన్నింటికీ భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విమాన సేవలు లభిస్తాయని చెబుతున్నారు. సో భోగాపురం ఈ తీరున ఎదిగిన క్రమం అయితే అందరికీ ఆనందంగా ఉందిపుడు.