అమెరికాలో గణేష్ నిమజ్జనం.. తెలుగు వారికి కీలక హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోధరుడు, శోభాయాత్రల మధ్య నిమజ్జన ఘట్టంతో వీడ్కోలు పొందాడు.

Update: 2026-09-23 17:22 GMT

ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోధరుడు, శోభాయాత్రల మధ్య నిమజ్జన ఘట్టంతో వీడ్కోలు పొందాడు. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజం, ముఖ్యంగా తెలుగు వారు నిర్వహించిన గణేష్ నిమజ్జనాలపై ఇప్పుడు సోషల్ మీడియాలోనూ స్థానిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అమెరికాలోని స్థానిక చట్టాలు , పర్యావరణ నిబంధనలను పాటించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వైరల్ వీడియోలు.. పెరిగిన ఆందోళన

ఇటీవల మిస్సోరీ రాష్ట్రంలో ఒక తెలుగు మహిళ సహజ సిద్ధమైన చెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. బహిరంగ ప్రదేశాల్లోని సరస్సులు, నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ , రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను కలపడం వల్ల జలచరాలు, నీటి ప్రాజెక్టుల నాణ్యత దెబ్బతింటుందని స్థానిక పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా బహిరంగ నీటి వనరులలో నిమజ్జనం చేస్తే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తెలుగు సంఘాలు.. ఎన్ఆర్ఐలకు ముఖ్యమైన సూచనలు

విదేశాల్లో మన పండుగలను జరుపుకోవడం అభినందనీయమే అయినా స్థానిక ప్రభుత్వాల నిబంధనలను ఉల్లంఘిస్తే అది మొత్తం సమాజంపై ప్రతికూల ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యుఎస్‌లోని భారతీయ, తెలుగు సంఘాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రసాయన రంగులు లేని, మట్టితో చేసిన విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. సరస్సులు లేదా నదుల్లో నేరుగా నిమజ్జనం చేయకుండా, ఇళ్ల వద్ద లేదా కమ్యూనిటీ సెంటర్లలో ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేసుకోవడం సురక్షితమైన మార్గం. బహిరంగ ప్రదేశాల్లో లేదా పార్కుల్లో వేడుకలు, నిమజ్జనాలు నిర్వహించే ముందు స్థానిక కౌన్సిల్ లేదా సిటీ అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తెలుగు అసోసియేషన్లు నిమజ్జన మార్గదర్శకాలపై సభ్యులకు ముందే స్పష్టమైన అవగాహన కల్పించాలి.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో మన ప్రవర్తన, పర్యావరణ స్పృహ కూడా ఆదర్శవంతంగా ఉండాలి. స్థానిక చట్టాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగకుండా పండుగలను జరుపుకోవడమే నిజమైన భక్తి అని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News