బుర్జ్ కలీఫాను తలపిస్తున్న బంగారం, వెండి ధరల మార్పు.. ఫోటో వైరల్.
పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా భావించే బంగారం, వెండి మార్కెట్లు ప్రస్తుతం ఊహించని కుదుపులకు లోనవుతున్నాయి.;
పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా భావించే బంగారం, వెండి మార్కెట్లు ప్రస్తుతం ఊహించని కుదుపులకు లోనవుతున్నాయి. 2026 జనవరి చివరి వారంలో చోటుచేసుకున్న విపరీతమైన ధరల మార్పులు చూస్తుంటే, ట్రేడింగ్ చార్టులు అచ్చం దుబాయ్ లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని పోలి ఉండటం గమనార్హం. ఒకేసారి నిలువుగా పెరిగి, అంతే వేగంతో పడిపోయిన ఈ ధరల గ్రాఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో డార్క్ హ్యూమర్‌తో కూడిన మీమ్స్‌కు దారితీస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ ఆర్థిక అలజడిపై మనము ఓ లుక్ వేద్దాం..
ఆకాశమే హద్దుగా పెరిగి.. అంతే వేగంగా పతనం:
ట్రేడింగ్ పరిభాషలో బుర్జ్ ఖలీఫా ప్యాటర్న్ అంటే ఒక భారీ ఊహాజనిత బుడగ (Speculative Bubble) ఒక్కసారిగా పేలిపోవడం. తాజాగా బంగారం, వెండి ధరల చార్టులు సరిగ్గా ఇలాగే కనిపిస్తున్నాయి. ఇక ధరలు రాకెట్ వేగంతో పైకి దూసుకుపోయి, మరు క్షణమే నిలువుగా కిందకు పడిపోయాయి. ఈ దృశ్యం ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఆకారాన్ని తలపిస్తోంది. సాధారణంగా మార్కెట్ మెట్లు ఎక్కినట్టుగా నెమ్మదిగా పైకి వెళ్లి, లిఫ్ట్ లాగా వేగంగా కిందకు పడుతుంది అంటారు. కానీ ఈసారి వెండి, బంగారం ధరలు అటు పైకి వెళ్లడం, ఇటు కిందకు రావడం రెండూ ఎలివేటర్ వేగంతోనే జరిగిపోవడంతో ఇన్వెస్టర్లు కోలుకోలేకపోయారు.
వెండి మార్కెట్‌లో భారీ విధ్వంసం:
ఇక ఈ ఆర్థిక సంక్షోభం తీవ్రత ఎంతలా ఉందంటే, కేవలం 36 గంటల వ్యవధిలో వెండి ధరలు దాదాపు 26 శాతం పడిపోయాయి. దీనివల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు 1.8 ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయిందని తాజా ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి.
ముఖ్యంగా గరిష్ట ధరల వద్ద (అంటే బుర్జ్ ఖలీఫా శిఖరం లాంటి స్పైర్ వద్ద) వెండి కొనుగోలు చేసిన సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లు ఈ భారీ పతనంతో సర్వస్వం కోల్పోయి విలవిలలాడుతున్నారు. మార్కెట్ నియంత్రణ లేని ఊహాగానాలు ఎంత ప్రమాదకరమో ఈ గ్రాఫ్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇంస్టాగ్రామ్ లోని ఫోటో కేవలం ఒక ఫన్నీ మీమ్ మాత్రమే కాదు, ఇన్వెస్టర్లకు ఇదొక గట్టి హెచ్చరిక. మార్కెట్ పరుగులు తీస్తున్నప్పుడు అత్యాశతో పెట్టుబడులు పెట్టడం ఎంతటి నష్టాన్ని తెస్తుందో ఇప్పుడు నిరూపించింది. బంగారం, వెండి లాంటి విలువైన లోహాల విషయంలో కూడా అప్రమత్తత అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.