బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు.. నిజమెంత?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.;
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. త్వరలోనే బీఆర్ ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీ నుంచి కూడా పదుల సంఖ్యలో కీలక నాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు.. వచ్చి బీఆర్ ఎస్ కండువా కప్పుకోనున్నారని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. అయితే.. దీనిలో నిజం ఎంత? అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితి పైకి కనిపిస్తున్నంత ఆనందంగా ఏమీ లేదు. అంతర్గత వివాదాలు పార్టీని కుదిపేస్తున్నాయి. ఈ విషయాన్ని గత నెలలో ఖమ్మంలో పర్యటించిన మాజీ మంత్రి బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా చెప్పారు. ''అంతర్గత కుమ్ములా టలతో మీరు పాడవడమే కాదు.. పార్టీని కూడా పాడుచేస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఒక్క ఖమ్మంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
ప్రధానంగా గత ఎన్నికల్లో టికెట్లు రాని వారు.. ఓడిన వారు కూడా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, సొంత కుమార్తె కవిత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పైగా ఆ పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు సొంత నేతలు కూడా.. ఎంత అభిమానం ఉన్నా.. సొంత ఖర్చులతో పార్టీని ముందుకు నడిపించలేమని చెబుతున్నారు. మరి ఇంతగా పార్టీ పరిస్థితి ఉంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులు ఎలా వస్తారన్నది ప్రశ్న.
ఇక, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చేందుకు కీలక నాయకులు ఎవరూ సిద్ధంగా లేదు. ఏదైనా ఉంటే.. బీఆర్ ఎస్ నుంచే నాయకులు బయటకు వచ్చేందుకు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ విషయాలు కేసీఆర్‌కు తెలియని కాదు. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆయన వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడే ప్రధాన ఎన్నికలు కూడా లేవని.. అలాంటప్పుడు నాయకులు ఎందుకు పార్టీ మారుతారని కూడా ప్రశ్నిస్తున్నారు.