రుణ భారతం : ప్రతీ ఒక్కరి తల మీద లక్షన్నర అప్పులు

ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం. చిట్టా పద్దులు సమస్తం అప్పుల వ్యవహారం అని పాడుకోవాల్సిందే. బడ్జెట్ అన్నది చిత్రంగా ఉంటుంది.;

Update: 2026-02-02 11:30 GMT

ఏ బడ్జెట్ చూసినా ఏమున్నది గర్వకారణం. చిట్టా పద్దులు సమస్తం అప్పుల వ్యవహారం అని పాడుకోవాల్సిందే. బడ్జెట్ అన్నది చిత్రంగా ఉంటుంది. రాబడి తక్కువగా ఉంటుంది. అయినా సరే భారీ నంబర్ తో బడ్జెట్ తయారు అవుతుంది. మరి ఇంత సొమ్ము ఎలా వస్తుంది అంటే రకరకాలైన అంచనాలు అందులో తెచ్చి పెడతారు. అయినా సరే అంతరం భారీగా ఉంటుంది. మరి ఆ లోటుని ఎలా పూడుస్తారు అంటే అప్పులు తెచ్చి అన్నది సింపుల్ ఆన్సర్. ఇపుడు కేంద్ర బడ్జెట్ లో చూస్తే అదే పరిస్థితిగా ఉంది. ఏకంగా 17.2 లక్షల కోట్ల అప్పులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతోంది. బడ్జెట్ ని 53 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన తరువాత వచ్చే రాబడులు ఆదాయాలు అన్నీ సరి చూసుకుంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి అన్న మాట.

మోడీ హయాంలో పెరిగింది :

అప్పులు గత ప్రధానుల హయంలో అంతా కలసి చేసిన అప్పుల కంటే రెట్టింపుగా మోడీ ప్రభుత్వ హయాంలో గత పన్నెండేళ్ళ కాలంలోనే అప్పులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. దీంతో ఈ దేశంలో ప్రతీ పౌరుడి నెత్తి మీద అప్పు ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేదని ఎవరూ చింతించ నక్కరలేదు, ఎందుకంటే అప్పు వారి తలకాయ మీద లక్షల్లోనే ఉంది. ఇంకా అది పెరగబోతోంది కూడా.

అప్పులు ఎలా తెస్తారు :

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తీసుకుంటే 17.2 లక్షల కోట్ల లోటు ఉంది కదా మరి వీటికి ఏ విధంగా అప్పులు తెస్తారు అంటే దానికి ఒక మార్గం ఉంది అంటున్నారు. డేటెడ్ సెక్యూరిటీలు అలాగే ఇతర మార్గాల ద్వారా ఈ అప్పులను సేకరించి తీసుకుని రావాలని కేంద్రం ఆలోచిస్తోందని అంటున్నారు. వచ్చే ఆదాయం అలాగే పెట్టే ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది దాంతో భారీగానే ద్రవ్య లోటు ఉంది దానికి పూడ్చుకునే మార్గాలని కేంద్రం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో 11. 7 లక్షల కోట్ల రూపాయలు డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సేకరిస్తారని అంటున్నారు. అలాగే చిన్న మొత్తాల పొదుపు, ఇతర రుణాల ద్వారా మిగిలిన ఆరు లక్షల కోట్లను సేకరిస్తారు అని అంటున్నారు.

నెలకు లక్ష కోట్ల వడ్డీ :

అప్పులు చేయడం ఎవరికైనా బాగానే ఉంటుంది. కానీ అసలు కంటే ముందు వడ్డీ పట్టి పీడిస్తుంది. ఈ క్రమంలో గత వడ్డీల చెల్లింపు పెను భారంగా మారబోతోంది. నెలకు లక్ష కోట్ల పైనే కేంద్ర ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సి వస్తోంది అని అంటున్నారు. ఈ వడ్డీలు అసలు అన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థ మీద అతి పెద్ద గుది బండగా మారుతున్నాయని అంటున్నారు. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకు కేంద్రం చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే అక్షరాలా 14,03,972 రూపాయలు అని అంటున్నారు. దానిని కనుక నెలకు విభజిస్తే 1.17 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని చెబుతున్నారు

అప్పుల లెక్క ఇదీ :

ఇక మోడీ ప్రధానిగా 2014లో అయ్యారు. ఆయన కంటే ముందు అంటే గత ఆరున్నర దశాబ్దాల కాలంలో ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని ఏలారు వారంతా కలసి చేసిన అప్పులు చూస్తే అక్షరాలా 55,87,147 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే సగటున ఏడాదికి 83 వేల కోట్ల అప్పు అన్న మాట. ఇక మోడీ ప్రధాని అయ్యాక చేసిన అప్పు తీసుకుంటే 1,52,85,363 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే సగటున నెలకే 1.10 లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు అన్న మాట. ఇంతలా అప్పులు చేస్తూ రుణ భారతాన్ని రచిస్తున్న తీరు మాత్రం ప్రతీ భారతీయ పౌరుడినీ ఆలోచింపచేస్తోంది అన్నది మాత్రం నిజం.

Tags:    

Similar News