ముద్రగడ లేఖకు బుద్ధా కౌంటర్

అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి చేసిన కామెంట్స్ లేఖలోని సారాంశం మీద మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.;

Update: 2026-02-02 13:02 GMT

ఏపీలో లేఖాస్త్రాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ సంధిస్తే ఆయనకు కౌంటర్ గా టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న మరో లేఖ వదిలారు. దీంతో ఈ రెండు లేఖలలోని అంశాలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ముద్రగడ పద్మనాభరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కి లేఖాస్త్రం సంధించారు. గోదావరి భాషలో యాసలో ఆయన రాసిన లేఖలో కాపుల గురించి ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు జమానాలో కాపులను టార్గెట్ చేస్తున్నారు అని ముద్రగడ తీవ్ర ఆరోపణ చేశారు. చంద్రబాబు ఎపుడు సీఎం అయినా ఇదే వైఖరితో సాగుతున్నారు అని ఆయన విమర్శించారు. 2014 నుంచి 2019 మధ్యలో తనను తన కుటుంబాన్ని వేధించిన బాబు ఇపుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కూడా ఇదే తీరున వేధింపులు చేస్తున్నారు అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

ఎందుకు ఆగ్రహం :

కాపుల మీద ఎందుకు చంద్రబాబుకు ఆగ్రహం అని ముద్రగడ ప్రశ్నించారు. కాపులను బీసీలలొ చేరుస్తాను అని 2014లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు దానిని నెరవేర్చలేదని దాంతో కాపులు అంతా ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారని ముద్రగడ అన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోనే వారు మరోసారి టీడీపీకి ఓటు వేసి గెలిపించారు అని చెప్పారు. మాజీ మంత్రులు అన్న గౌరవం లేకుండా జోగి రమేష్ విడదల రజనీ అంబటి రాంబాబు వంటి వారి మీద ఈ దాడులు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ఏపీలో రాక్షస పాలన సాగుతోందని ముద్రగడ ఆక్షేపించారు.

అందరినీ జైలులోనే :

కేంద్రంతో మాట్లాడి ఏపీలో ఎమర్జెన్సీ పాలన పెట్టించండని, అపుడు ప్రతిపక్ష నాయకులు అందరినీ జైలులో ఉంచేయవచ్చు అని ముద్రగడ సెటైరికల్ గా సలహా ఇచ్చారు. అబద్ధాలు చెప్పకూడదని మా నాన్న మాకు చెప్పేవారు అని ముద్రగడ గుర్తు చేసుకున్నారు ఒక అబద్ధానికి వంద అబద్దాలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. అయితే తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని తీరా సీబీఐ ఇచ్చిన నివేదికలో అసలు విషయం బయటపడిందని అందుకే దానిని డైవర్ట్ చేసే ఉద్దేశ్యంతో ఈ రకంగా చేస్తున్నారు అని ముద్రగడ ఆరోపించారు. అయితే చంద్రబాబు ఆ విధంగా కాకుండా తప్పు జరిగింది పొరపాటు అయింది అని ఉంటే ఎంతో గౌరవంగా హుందాగా ఉండేదని ముద్రగడ అన్నారు.

బుద్ధా కౌంటర్ :

అయితే ముద్రగడ పద్మనాభరెడ్డి చేసిన కామెంట్స్ లేఖలోని సారాంశం మీద మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ముద్రగడకు ఇపుడు కాపు కులం గుర్తుకు వచ్చిందా అని అందులో నిలదీశారు. ఆయనకు అవసరం అయినప్పుడే కులం గురించి మాట్లాడమని ఆయన తండ్రి చెప్పారా అని ఎద్దేవా చేశారు. గతంలో చాలా సందర్భాలలో కాపులను వైసీపీ వేధిస్తే అపుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

పవన్ భార్యను తల్లిని :

వైసీపీ హయాంలో పవన్ భార్యను తల్లిని అవమానించినపుడు ముద్రగడకు కాపులు ఎందుకు గుర్తుకు రాలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. అంతే కాదు మంత్రి నారాయణ మీద తప్పుడు కేసులు పెట్టించి హైదరాబాద్ నుంచి చిత్తూరు దాకా తీసుకెళ్ళినపుడు ఆయన కాపు సామాజిక వర్గం అనిపించలేదా ముద్రగడ గారూ అని నిలదీశారు. చంద్రబాబు భార్యను అసెంబ్లీ లోపలా బయటా నానా మాటలు అన్నపుడు ఇపుడు పలుకుతున్న చిలక పలుకులు నాడు ఎందుకు గుర్తుకు రాలేదని వెంకన్న అడిగారు.

వాటిని సమర్ధిస్తారా :

మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడిన బూతులను సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. అలాగే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద చేసిన దాడికి మద్దతు ఇస్తున్నారా అని ముద్రగడని నిలదీశారు. 1994 ఎన్నికల్లో ఓటమి చెంది ఇంట్లో కూర్చుంటే 1999లో ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ కి చంద్రబాబు పంపించినపుడు చంద్రబాబు మంచి వ్యక్తి అని చెప్పింది ముద్రగడే కదా అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు.

అసూయతో లేఖలు వద్దు :

వాస్తవాలు తెలుసుకుని లేఖలు రాయండి, అంతే కానీ అసూయతో రాయవద్దు అని బుద్ధా వెంకన్న కోరారు. చంద్రబాబు కులానికో మతానికో ప్రాంతానికో చెందిన వారు కాదని, ఆయన ప్రపంచ నాయకుడని అన్నారు. బాబు మీద ఎవరు అసూయ చెందినా ఆయన అంతకంతకు పెరుగుతారు అన్నది గుర్తు పెట్టుకోవాలని ముద్రగడకు సూచించారు. మొత్తానికి ముద్రగడ బాబుకు రాసిన లేఖ దానికి కౌంటర్ గా బుద్ధా వెంకన్న రాసిన లేఖ రెండూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News