ఢిల్లీకి ఫిర్యాదు...ఏపీ బీజేపీ నేతల వ్యూహం
| ఏపీలో టీడీపీ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. విశాఖ మేయర్, భీమవరం, కడప పదవుల అంశాలను ప్రస్తావిస్తూ డిసెంబర్‌లో ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చలో ఢిల్లీ అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అన్యాయం మీద జాతీయ స్థాయి పెద్దలకే చెప్పుకుంటామని వారు అంటున్నారు. అంతే కాదు 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ఇతరత్రా కానీ జరిగిన అన్యాయం మీద కేంద్ర పెద్దలకే అన్ని విషయాలు చెబుతామని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఇవన్నీ పూర్తి అయ్యాక డిసెంబర్ నెలలో హస్తిన ప్రయాణానికి ఏపీలో కీలక బీజేపీ నేతలు అంతా నడుం బిగిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీ దాకా బీజేపీ నేతలు వెళ్లాల్సిన అవసరం ఏమిటి, వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఏమిటి, కేంద్ర పెద్దలకు ఏమిటి విన్నవిస్తారు, అక్కడ నుంచి వారికి ఏ రకమైన హామీ లభిస్తుంది ఇవన్నీ కూడా చర్చలుగా ప్రస్తుతం సాగుతున్నాయి.
చిన్న చూపు అంటూ :
తమకు ఏపీలో టీడీపీ పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు అన్నది చాలా మంది బీజేపీ నేతలలో ఉన్న భావనగా చెబుతున్నారు. కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంతగానో కృషి చేసిందని వారు అంటున్నారు. అంతే కాకుండా కూటమి ఏపీలో అధికారం చేపట్టాక పెద్ద ఎత్తున నిధులను కూడా సమకూర్చి పెడుతున్నారని అనేక ప్రాజెక్టులు ఏపీకి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రగతిలో భాగం అవుతున్నారని గుర్తు చేస్తున్నారు. మరి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఇంతలా సహాయం పొందుతున్న టీడీపీ మాత్రం ఏపీలో బీజేపీ పట్ల చిన్న చూపు చూస్తోంది అన్నది కాషాయం నేతలను ఆవేదనకు గురి చేస్తోంది అని అంటున్నారు.
నామినేటెడ్ లోనూ :
ఇక ఏపీలో నామినేటెడ్ పదవులు అనేకం ఉంటే అందులో బీజేపీ నేతలకు అన్యాయమే జరిగింది అన్నది చాలా కాలంగా బీజేపీ నేతలు చాలా మంది చెబుతున్న మాటగానే ఉంది. పోనీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా బోలెడు పదవులు ఇందులో ఉన్నాయి, తమకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని భావించినా అక్కడా ఏమీ పెద్దగా ఒనగూడలేదని వారు చెబుతున్నారు. విశాఖ లాంటి కార్పోరేషన్ కి మేయర్ లేదా డిప్యూటీ మేయర్ అడిగినా కూడా ఇవ్వలేదని అంటున్నారు. అలాగే 120 వార్డులు ఉంటే 20 వార్డులు కూడా తమకు పొత్తులో కేటాయించలేదని ఎత్తి చూపిస్తున్నారు.
రగులుతున్నారు :
అలాగే మునిసిపల్ పరిషత్తు ఎన్నికల్లో కూడా కోరుకున్న సీట్లను కానీ కోరుకున్న చోట్లలో కానీ ఇవ్వలేదని పైగా తమకు కేటాయించిన సీట్లలో పొత్తు ధర్మం సరిగ్గా అమలు చేయలేకపోవడం వల్లనే ఓటమి చెందామని నెల్లిమర్లలో టీడీపీ రెబెల్ చైర్ పర్సన్ గా పోటీ చేసి బీజేపీని ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అనంతపురం మేయర్ సీటు ఓటమి వెనకాల ఇదే ఉందని అంటున్నారు. కడప జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఇవ్వలేదని కూడా అక్కడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. భీమవరం మున్సిపల్ చైర్మన్ పదవి కోరితే కేవలం అయిదు వార్డులు ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా ఫైర్ అయ్యారు. ఇవే కాకుండా చాలా అంతర్గత విషయాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో కేంద్ర బీజేపీ పెద్దల వద్ద అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఏపీలో బీజేపీకి జరుగుతున్న అన్యాయం మీద వివరించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఈ విధంగా తమ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తుందన్న వార్తలు అయితే రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి. దీని మీద ఏమి జరుగుతుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.