ఎన్టీఆర్ భారతరత్న...కూతురు అందుకోవచ్చా ?
| దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరోసారి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించారు. అవార్డు ప్రకటిస్తే ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి అందుకోవాలన్నది తన ఆకాంక్షగా తెలిపారు. అయితే ఈ పురస్కారాన్ని స్వీకరించే విషయంలో లక్ష్మీపార్వతికి తొలి ప్రాధాన్యత ఉంటుందనే చర్చ మొదలైంది.
నందమూరి తారక రామారావు సినీ రాజకీయ రంగాలలో తనదైన ప్రతిభా పాటవాలు చూపించిన మహనీయుడు. తెలుగు జాతి నిలువెత్తు సంతకంగా ఎన్టీఆర్ ని చెప్పుకుంటారు. ఆయన మరణించి ఇప్పటికి 31 ఏళ్లు అవుతోంది. అయితే రెండు కీలక ప్రజా సంబంధిత రంగాలలో అసమాన ప్రతిభా పాటవాలను చూపించిన ఎన్టీఆర్ కి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించాలని అభిమాన జనంతో పాటు అందరూ రాజకీయాలకు అతీతంగా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న అన్నది ఒక డిమాండ్ గానే ఉండిపోతోంది. ఈ మధ్యలో ఎన్నోసార్లు కేంద్రంలో ప్రభుత్వాలు ఏపీలో టీడీపీ మద్దతుతో ఏర్పాటు అయ్యాయి. అయినా కానీ ఎన్టీఆర్ కి భారతరత్న మాత్రం దక్కలేదు. తాజాగా చూస్తే మరోసారి ఈ డిమాండ్ తెర ముందుకు వచ్చింది.
అన్న గారికి ఇవ్వాల్సిందే :
ఎన్టీఅర్ కి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తాజాగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో తీర్మానం పెడితే కేంద్రం ఆమోదిస్తుందని కూడా చెప్పారు. మిత్రపక్షంగా టీడీపీ ఉన్నందువల్ల కచ్చితంగా భారతరత్న ఎన్టీఆర్ కి దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని మొదటిగా కోరింది తానే అని ఆయన గుర్తు చేశారు. అప్పలో ప్రధాని వాజ్ పేయి కూడా కలసి వినతి చేశాను అని చెప్పారు. ఇదిలా ఉంటే భారతరత్న అవార్డుని ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి అందుకోవాలన్నది తన ఆకాంక్షగా యార్లగడ్డ చెప్పడం విశేషం. ఈ విధంగా ఆయన మరోసారి భారతరత్న చర్చతో పాటు ఎవరు ఈ అవార్డు అందుకోవాలి అన్న దాని మీద బిగ్ డిబేట్ కి ఆస్కారం కల్పించారు అని అంటున్నారు.
కుమార్తెలు అందుకోవచ్చా :
ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే ఆయన జీవించి లేరు కాబట్టి కుమారులు కుమార్తెలు అందుకోవచ్చా అన్నది ఒక కొత్త చర్చగా ముందుకు వస్తోంది. అసలు ప్రోటోకాల్ ఏమి చెబుతోంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి ఒక ప్రముఖుడు మరణానంతరం ప్రకటించే భారతరత్న లేదా పద్మ వంటి అత్యున్నత పౌర పురస్కారాలను వారి సతీమణి, కుమార్తెలు, కుమారులు లేదా సమీప కుటుంబ సభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవచ్చు. దీనికి సంబంధించి చట్టంలో నిర్దిష్టమైన ఆంక్షలు ఏవీ లేవని చెబుతున్నారు. ఎవరు అందుకోవాలి అన్న దాని మీద ప్రత్యేక చట్టం లేదు, అలాగే కఠినమైన చట్టపరమైన నిబంధనలు ఏమీ లేవని అంటున్నారు.
సమీప బంధువులకు అవకాశం :
ఈ అత్యున్నత పురస్కారాలు సమీప బంధువులు అందుకోవచ్చు. కానీ దాని మీద నిర్వచనమే ఇపుడు చర్చకు వస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్ ప్రకారం అవార్డు గ్రహీత జీవించి లేకపోతే వారి సమీప కుటుంబ సభ్యులు పురస్కారాన్ని స్వీకరించేందుకు అర్హులు. అయితే సమీప బంధువులలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అన్నది కేలకమైన ప్రశ్నగా ఉంది. సాధారణంగా జీవిత భాగస్వామి అంటే సతీమణి లేదా భర్త జీవించి ఉంటే ప్రోటోకాల్ ప్రకారం వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వారు కనుక లేకపోతేనే కుమార్తెలు లేదా కుమారులు సమీప బంధువులుగా వస్తారు. ఇక్కడ జీవిత భాగస్వామి జీవించి లేకపోయినా అనారోగ్యం వల్ల రాలేకపోయినా కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయించుకున్నా వారి కుమార్తెలు, కుమారులు, మనవలు లేదా ఇతర దగ్గరి రక్త సంబంధీకులు ఈ పురస్కారాన్ని అందుకోవచ్చు అని అంటున్నారు.
విధానం ఇలాగే :
ఇక ఈ విధి విధానాలు చూస్తే కనుక దివంగతులైన వారికి అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్రపతి భవన్ అధికారులు దివంగత నేత కుటుంబాన్ని సంప్రదిస్తారు. పురస్కారాన్ని అందుకోవడానికి కుటుంబం తరఫున ఎవరు హాజరవుతున్నారో కుటుంబ సభ్యులు పరస్పర అంగీకారంతో ఒకరి పేరును ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ మీదట వారి పేరునే అధికారిక ఆహ్వాన పత్రంలో నమోదు చేస్తారు. అంటే ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఒకరిని ఎంపిక చేసి పేరుని కేంద్రానికి తెలియచేయాలి అన్న మాట. మరి ఎన్టీఆర్ విషయంలో ఈ ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నదే చర్చగా ఉంది.
లక్ష్మీపార్వతికి తొలి ప్రాధాన్యత :
ఇక ఎన్టీఆర్‌కు ఒక వేళ భారతరత్న పురస్కారాన్ని ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఆయన చట్టబద్ధమైన జీవిత భాగస్వామిగా ఆయన సతీమణి అయిన లక్ష్మీపార్వతికే ఆ పురస్కారాన్ని స్వీకరించే మొదటి హక్కు ఉంటుంది ఆమె కనుక అనుమతి ఇస్తే మాత్రమే కుమారులు లేదా కుమార్తెలకు అవార్డును అందజేస్తారు. వారసత్వ చట్టాలు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆమె ఆయనకు మొదటి వారసురాలు అవుతారు అని అంటున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరి లక్ష్మీపార్వతి తన అంగీకార పత్రం ఇస్తే మాత్రమే ఎన్టీఆర్ కుమారులు లేదా కుమార్తెలకు ఆ పురస్కారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే 2023లో ఎన్టీఆర్ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని విడుదల చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమానికి తనను పిలవకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని లక్ష్మీపార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతికి ఇక్కడ ప్రస్తావించుకుంటే యార్లగడ్డ ఆకాంక్షిస్తున్నట్లుగా కుమార్తెలకు తీసుకునే వీలు ఉండకపోవచ్చు అని అంటున్నారు.