ఎందుకు ధిక్కరించానో పవన్ కే చెబుతా !
| నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కూటమి ఒప్పందం అమలు కాలేదు. టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వాల్సిన జనసేన కౌన్సిలర్ కల్యాణ చక్రవర్తి పోటీలోకి దిగి 18 ఓట్లతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు వచ్చాయి. పదవికి రాజీనామా చేయాలన్న పవన్ ఆదేశాలను ఆయన పట్టించుకోకపోవడం, టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
కూటమి ఐక్యంగా ముందుకు సాగాలన్నది ఏపీలో మూడు పార్టీల అధినేతల ఆలోచన. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల దానికి విఘాతం కలిగింది. ఇక చూస్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కూటమి ఒప్పందానికి తూట్లు పొడిచింది.. అంతే కాదు కూటమి ధర్మం కట్టు తప్పడం ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. ఏకంగా ఒప్పందాన్నే తల్లకిందులు చేసి జనసేన టీడీపీకి షాక్ ఇచ్చేసింది. తెలుగుదేశానికి దక్కాల్సిన వైస్ చైర్మన్ పోస్టుని జనసేన నేత వ్యూహాత్మకంగా అందుకున్నారు. అంతే కాదు తాను ఎందుకు కూటమి ధర్మాన్ని ధిక్కరించానో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నే చెబుతాను అని ఆ పదవిని దక్కించుకున్న జనసేన కౌన్సిలర్ టి. కల్యాణ చక్రవర్తి అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ కూటమి ఐక్యత మీదనే పెద్ద చర్చగా మారుతోంది.
ఇంతకీ ఏమి జరిగిందంటే :
ఇక తాజాగా ఈ నెల 24న జరిగిన వైఎస్ చైర్ పర్సన్ల ఎన్నిక సందర్భంగా జనసేనలో తిరుగుబాటు కనిపించింది. కూటమి ఒప్పందం ప్రకారం చూస్తే కనుక నిడదవోలు మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవిని జనసేనకు వైస్ చైర్‌పర్సన్ పదవిని టీడీపీకి కేటాయించేలా కూటమి నేతల మధ్య ముందస్తు అవగాహన కుదిరింది. దీని ప్రకారం వైఎస్ చైర్ పర్సన్ పదవికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరావుకు జనసేన మద్దతు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 4వ వార్డు జనసేన కౌన్సిలర్ డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి అనూహ్యంగా వైఎస్ చైర్ పర్సన్ పదవికి పోటీలోకి దిగారు. 15 మంది జనసేన కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌తో సహా ఒక బీజేపీ కౌన్సిలర్, ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల మద్దతుతో మొత్తం 18 ఓట్లు సాధించి ఆయన ఆశ్చర్యకరంగా వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. ఇక టీడీపీ అభ్యర్థికి చూస్తే కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీకి ఇది బిగ్ షాక్ గా మారింది.
పవన్ కే చెబుతా :
ఈ నేపథ్యంలో వైఎస్ చైర్ పర్సన్ గా నెగ్గిన కల్యాణ చక్రవర్తి ఎందుకు కూటమి ధర్మం తప్పామన్నది తమ పార్టీ అధినేత పవన్ కే చెబుతామని అంటున్నారు. అదే విధంగా స్థానికంగా జరిగిన పరిణామాలు ఏమిటో త్వరలోనే బయటపెడతామని ఆయన వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాంశమైంది. అయితే తాము చేసినది కరెక్టే అన్నది కల్యాణ చక్రవర్తి ఆయన వర్గీయుల వాదనగా ఉంది. కానీ దీని మీద అటు టీడీపీ రగిలిపోతూంటే ఇది జనసేన సైతం సీరియస్ గా ఉంది. కళ్యాణ చక్రవర్తి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించినప్పటికీ కల్యాణ చక్రవర్తి వెనక్కి తగ్గకపోవడం కూడా గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఆగ్రహం:
తన సొంత పార్టీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలోనే కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా జరగడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేశ్ నుంచి ఆయన వివరణ కోరారని చెబుతున్నారు. మరో వైపు చూస్తే కల్యాణ చక్రవర్తి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారని నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేశ్ విమర్శించారు. పార్టీ ఆదేశాలను పాటించకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని మంత్రి దుర్గేశ్ గట్టిగానే హెచ్చరించారు.
బూరుగుపల్లి భావోద్వేగం :
ఇక ఈ పరిణామాల మీద టీడీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. కూటమి ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం టీడీపీకి పదవిని అప్పగించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన మొదట హెచ్చరించారు. అయితే తరువాత మాత్రం వెనక్కి తగ్గారు. ఆయన కూటమి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒక దశలో భావోద్వేగానికి గురి అయ్యారు. తాను దీక్ష చేస్తే తనకు ఏమైనా అయితే అమెరికాలో తన కుమారుడు ఉన్నందువల్ల అంత్యక్రియలు నిర్వహించే వారు కూడా ఉండరనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను అన్నారు. అయితే టీడీపీ అధిష్టానం న్యాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఎన్ని త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించడం విశేషం.