అమెరికా పిల్లలకు SpaceX షేర్లు ఇవ్వనున్న ఎలాన్ మస్క్.. ఎప్పటి నుంచి అంటే?
| అమెరికాలోని పిల్లలకు రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు ఇవ్వనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఒకటి కంపెనీ నుంచి, మరొకటి తన వ్యక్తిగత వాటా నుంచి అందించనున్నారు. వీటి బదిలీ 2026 డిసెంబర్, 2027 జూన్‌లో ప్రారంభం కానుంది. ఒక్కో చిన్నారికి లభించే రెండు షేర్ల విలువ ప్రస్తుతం సుమారు 255 డాలర్లు.
ఎలాన్ మస్క్ ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాలోని పిల్లలకు SpaceX కంపెనీ షేర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఒక్కో చిన్నారికి రెండు షేర్లు అందనున్నాయి. ఇందులో ఒకటి కంపెనీ నుంచి, మరొకటి మస్క్ తన సొంత వాటా నుంచి ఇవ్వనున్నారు.
నవంబర్ 25న SpaceX చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న Trump Accounts ఖాతాలకు ఒక్కో కొత్త Class A షేరు అందుతుంది. దీనికి అదనంగా తాను కూడా అదే సంఖ్యలో షేర్లు ఇస్తానని మస్క్ తెలిపారు.
ఈ షేర్లు ఒకేసారి చేతికి రావు. SpaceX ఇచ్చే షేర్ల బదిలీ డిసెంబర్ 2026లో మొదలవుతుంది. మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్ల బదిలీ మాత్రం 2027 జూన్‌లో జరగనుంది. ఆయన షేర్లపై ఉన్న లాక్-అప్ గడువు అప్పటికి ముగుస్తుంది.
ప్రస్తుతం ఒక్క SpaceX షేరు ధర 127.44 డాలర్లు. ఈ లెక్కన రెండు షేర్ల విలువ సుమారు 255 డాలర్లు. మొత్తం 7.2 కోట్ల మంది పిల్లలకు ఈ ప్రయోజనం అందితే షేర్ల విలువ 18 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
ఒక ప్రైవేట్ కంపెనీలో పిల్లలకు వాటా ఇవ్వాలన్న మస్క్ నిర్ణయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.