అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!
| అర్కాన్సాస్‌లో నవంబర్ 21న జరిగిన కారు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 43 ఏళ్ల సోమసుందరం అశోక్కుమనార్ మరణించారు. ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఈ-బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ భారతీయ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్‌విల్‌లో నవంబర్ 21న జరిగిన ప్రమాదంలో భారత సంతతికి చెందిన 43 ఏళ్ల సోమసుందరం అశోక్కుమనార్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్న ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. SW 14వ వీధి, టన్‌బ్రిడ్జ్ డ్రైవ్ కూడలిలో ఈ ప్రమాదం జరిగింది. జేవియర్ ఎడ్గార్డో రేయెస్ ఒరెల్లానా అనే 22 ఏళ్ల యువకుడు నడుపుతున్న కారు వేగంగా వచ్చి రెడ్ సిగ్నల్ దాటింది. అదే సమయంలో అశోక్కుమనార్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనను చూసిన వారు పోలీసులకు వివరాలు అందించారు.
ఢీకొన్న ధాటికి అశోక్కుమనార్ కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ఈ-బైక్‌ను ఢీకొట్టింది. దానిపై ఉన్న 39 ఏళ్ల జాకబ్ స్టాలీ అక్కడికక్కడే మరణించారు. అశోక్కుమనార్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో కారులో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతోందని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే పిల్లల ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ప్రమాదానికి కారణమైన కారును నడిపిన ఒరెల్లానా కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక కేసు వివరాలను బెంతన్ కౌంటీ ప్రాసిక్యూటర్‌కు అందజేయనున్నారు.
భర్తను కోల్పోయిన కుటుంబానికి ఇప్పుడు ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం మరో ఆందోళనగా మారింది. ఒకే ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం బెంటన్‌విల్‌లో విషాదాన్ని నింపింది.