వైఎస్ జగన్.. 16 నెలల జైలు.. @ 12 ఏళ్ల బెయిలు...
ఏకంగా తన తండ్రి పేరిటనే పార్టీ పెట్టి ఉప ఎన్నికలో అత్యధిక సీట్లు సాధించారు. అప్పటికి ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్ ది కీలక పాత్ర అని అంచనాలు..!;
అది 2012 సంవత్సరం... ఉమ్మడి ఏపీ... అప్పటికే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి దాదాపు మూడేళ్లు అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి.. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు... ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి కేంద్ర మంత్రి.. బీ(టీ)ఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఒక మహోద్యమంగా సాగుతోంది. రాజకీయం అంతా రగడరగడ..! ఈ మధ్యలోనే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చేందుకు యాత్ర కొనసాగిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్. దీనిని కాదన్నందుకు కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఏకంగా తన తండ్రి పేరిటనే పార్టీ పెట్టి ఉప ఎన్నికలో అత్యధిక సీట్లు సాధించారు. అప్పటికి ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్ ది కీలక పాత్ర అని అంచనాలు..!
రెండేళ్లలోపే ఎన్నికలు ఉండగా...
కేవలం రెండేళ్లలోపే ఎన్నికలు ఉండగా 2012లో కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్రమ ఆస్తులు కేసులో వైఎస్ జగన్ ను 2012 మే 27న సీబీఐ అరెస్టు చేసింది. అప్పట్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా తెలుగువారైన ఐపీఎస్ అధికారి (మహారాష్ట్ర కేడర్) లక్ష్మీనారాయణ ఉన్నారు.
-కాంగ్రెస్ అంటే వైఎస్ కుటుంబం... వైఎస్ కుటుంబం అంటే కాంగ్రెస్ అనుకునే స్థితి నుంచి వైఎస్ఆర్ కుమారుడిని అరెస్టు చేయడం అప్పట్లో చాలా పెద్ద సంచలనం. జగన్ అరెస్టుకు నిరసనగా నాడు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు. ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజ్ భవన్ వద్ద, తర్వాత నివాసం లోటస్ పాండ్ వద్ద రాత్రి వేళ ఆందోళన చేశారు. తమ నిరసన వ్యక్తం చేశారు.
అలా 16 నెలలు..
2012 మే 27న అరెస్టయిన వైఎస్ జగన్ 2013 సెప్టెంబరు 23 వరకు జైల్లో ఉన్నారు. అంటే దాదాపు 16 నెలలు. సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2013 సెప్టెంబరు 24న బయటకు వచ్చారు. నాడు భారీ ఊరేగింపుతో ఆయన లోటస్ పాండ్ లోని నివాసానికి చేరుకున్నారు. అయితే, వైఎస్ జగన్ అక్రమంగా సంపాదించింది రూ.లక్ష కోట్లు అంటూ ఆయనపై ప్రత్యర్థులు, ప్రత్యర్థి మీడియా విమర్శలు చేశాయి. జగన్ తర్వాత రూ.43 వేల కోట్లు అని ఒకసారి.. ఇలా లెక్కలు తగ్గించుకుంటూ పోయారు. కాగా, తనపై నమోదైనవి అక్రమ కేసులు అని వైఎస్ జగన్, ఆయన మీడియా వాదించాయి.
-వైఎస్ జగన్ విడుదలై 12 ఏళ్లు అయింది. ఆయనపై నమోదైన కేసుల విచారణ సీబీఐ కోర్టులో ప్రాథమికంగా డిశ్చార్జి పిటిషన్ల స్థాయిలోనే ఉంది. ముందుగా ఇవి తేలితేనే అభియోగాల నమోదు ఉంటుంది. తర్వాత సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటాయి. ఇక తమపై కేసులను కొట్టివేయాలంటూ నిందితుల్లో కొందరు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కాదంటే సీబీఐ కోర్టుకు వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఉన్న వాన్ పిక్ సంస్థ ఓ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి తిరిగి హైకోర్టుకు రాగా.. కొట్టివేశారు. దాల్మియా సిమెంట్స్ పిటిషన్ హైకోర్టులో ఉంది.
డిశ్చార్జి పిటిషన్లతోనే డిలే
జగన్ అక్రమాస్తుల కేసులో 130పైగా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ బాగా జాప్యం అవుతోంది. ఇక
2013 నుంచి దాఖలైన అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జి పిటిషన్లపై ఏడుగురు జడ్జిలు విచారణ చేపట్టారు. కానీ, అవి పూర్తికాకముందే బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి టి.రఘురాం వాదనలు వింటున్నారు.
-తనపై నమోదైనవి అక్రమ కేసులు అని వైఎస్ జగన్ ఆయన మీడియా బలంగా వాదిస్తోంది. ఇక వైఎస్ జగన్ ఆ తర్వాత బయటకు వచ్చినా ఉమ్మడి ఏపీ విడిపోయింది. 2014లో విభజిత ఏపీలో ప్రతిపక్ష నేతగా, 2019లో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2024లో ఓడిపోయినా...2029తో తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు.