జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే ఆడియో వైరల్.. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత!

జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;

Update: 2025-08-17 06:53 GMT

వార్-2 సినిమా అనంతపురం జిల్లాలో అగ్గి రాజేసింది. అనంతపురం నగరంలో వార్-2 సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వార్నింగు ఇచ్చారంటూ ఫ్యాన్స్ ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అంతేకాకుండా జూనియర్ ను ఎమ్మెల్యే దగ్గుపాటి దూషించారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బేషరతుగా జూనియరుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వందల మంది ఫ్యాన్స్ ఎమ్మెల్యే కార్యాలయానికి రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. కాగా, జూనియర్ ను తాను దూషించలేదని, నందమూరి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. జూనియర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడరని ఫ్యాన్ ఆందోళనకు దిగారు. తమ యువనేత నారా లోకేశ్ కు వ్యతిరేకంగా జూనియర్ వ్యవహరిస్తున్నారని, అనంతపురంలో జూనియర్ సినిమాలు ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే వార్నింగు ఇచ్చారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

వార్ సినిమా విడుదల సందర్భంగా నగరంలో స్పెషల్ షోకు ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను జూనియర్ అభిమానుల సంఘం నేత ధనుంజయనాయుడు ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే తమ నేతకు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ షోకు తాను వచ్చేదిలేదని చెప్పిన ఎమ్మెల్యే, అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగి, ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ కు రాజకీయాలతో సంబంధం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. పార్టీకి అవసరమైనప్పుడు జూనియర్ పనిచేయలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో తాము కూడా టీడీపీకి ఓటు వేశామన్న విషయాన్ని ఎమ్మెల్యే గమనించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఆందోళనకు దిగడంతో ఎమ్మెల్యే కార్యాలయం తలుపులను సిబ్బంది మూసేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేరని, ఆయన వచ్చాక మాట్లాడదామని సిబ్బంది ఫ్యాన్స్ ను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మరోవైపు తాను జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్లు వైరల్ చేయడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఎవరో ఫేక్ ఆడియో సృష్టించి వైరల్ చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారా, నందమూరి కుటుంబాలు అంటే నాకు చాలా అభిమానం. ఎవరో గిట్టనివారు ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడి ఉంటే నన్ను క్షమించాలని ఎమ్మెల్యే కోరారు. అదేసమయంలో ఫేక్ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News