తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేష్ రోడ్డు ప్రమాదంలో మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేష్ మృతి చెందారు.

Update: 2026-07-28 07:13 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేష్ మృతి చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున బాపులపాడు మండలంలోని బొమ్మలూరు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, నున్న సురేష్ తన భార్య విమలాదేవితో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మలూరు టోల్‌ప్లాజా వద్ద నిలిపి ఉన్న లారీని వారి కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నున్న సురేష్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన భార్య విమలాదేవిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమల విద్యాసంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నున్న సురేష్ ఆకస్మిక మరణం విద్యారంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపట్ల విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News