పైసల్లేవని 'చేతు'లెత్తేసిన కాంగ్రెస్ అభ్యర్థి

పార్టీ నుండి ఎలాంటి ఫండ్‌ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై పడుతున్నట్లు పేర్కొనడం విశేషం.

Update: 2024-05-05 15:30 GMT

సూరత్, ఇండోర్ లలో కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఒడిశాలోని పూరీ లోక్ సభ అభ్యర్థి చేరారు. నా దగ్గర పైసలు లేవని, ఈ పరిస్థితులలో పోటీ చేయలేనంటూ పూరీ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతి కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఆమె మెయిల్‌ పంపారు. పార్టీ నుండి ఎలాంటి ఫండ్‌ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై పడుతున్నట్లు పేర్కొనడం విశేషం.

సుచరిత మొహంతి మాజీ ఎంపీ బ్రజామోహన్‌ మొహంతి కుమార్తె. పార్టీ ఎలాంటి నిధులు సమకూర్చదని, ఎవరికి వారు సొంత నిధులతో ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్‌ అజోయ్‌కుమార్‌ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర వెల్లడించారు. జర్నలిస్ట్ గా పని చేసిన తాను పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, ఇప్పటివరకు తనవద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేశానని, ప్రస్తుతం తన వద్ద పైసా కూడా లేదని సుచరిత వాపోయారు.

ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైందని, ప్రచార ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం కూడా చేశానని అయినా కూడా అవి విజయవంతం కాలేదని, నిధుల కొరత మూలంగానే తాను ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నానని సుచిత్ర పేర్కొన్నారు. బరి నుండి తప్పుకున్నా తాను పార్టీలో పనిచేస్తూ రాహుల్ నాయకత్వం బలోపేతం కోసం పనిచేస్తానని తెలిపారు.

ఆరోవిడత పోలింగ్ స్థానాల జాబితాలో పూరీ ఉన్నది. అక్కడ నామినేషన్ల దాఖలుకు 6వ తేది చివరి రోజు. ఇక్కడ బీజేపీ తరపున పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, అధికార బిజూ జనతాదళ్‌ నుంచి ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ అరూప్‌ పట్నాయక్‌ పోటీ చేస్తున్నారు. నామినేషన్లకు రెండు రోజుల ముందు సుమిత్ర చేతులెత్తేయడంతో ఈ టికెట్ ఎవరికి కేటాయించనున్నారో వేచిచూడాలి.

Tags:    

Similar News