మోడీ ఆ మాట ఎత్తకుండా ఉంటే కూటమికి మేలు !

రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

Update: 2024-05-05 00:30 GMT

ఏపీకి మోడీ వస్తున్నారు. మొత్తానికి చూస్తే రెండు డేట్స్ ఇచ్చారు. దాంతో టీడీపీ కూటమి నేతలు మోడీ ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ 8వ తేదీలలో ఏపీలో మోడీ బిజీగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాయలసీమలోని పీలేరులో మోడీ ఎన్నికల సభ ఉంటుంది.

రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. దాంతో మోడీ అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలోని వేమగిరిలో మరో సభ మోడీది ఉంటుంది. అక్కడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు.

అనకాపల్లిలో మోడీ మూడవ సభ ఉంటోంది. అక్కడ సీఎం రమేష్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విజయవాడలో మోడీ రోడ్ షోని పెట్టారు. విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇలా మోడీ సభలు అన్నీ బీజేపీ వారి ప్రచారం కోసమే ఏర్పాటు చేశారు. ఆ పరిధిలోని టీడీపీ జనసేనలకు సైతం లాభం కలిగేలా మోడీ సభలను డిజైన్ చేస్తున్నారు.

మోడీ ఏపీకి వస్తున్నారు. అది కూడా పోలింగ్ కి నాలుగు రోజులు ముందు వస్తున్నారు. ఆయన ప్రభావం గట్టిగానే ఉండాలని కూటమి తాపత్రయపడుతోంది. ఎందుకంటే 2014లో కూడా మోడీ చివరిలో నిర్వహించిన సభకు ఏపీలో పొలిటికల్ రూట్ ని కూటమిని అనుకూలంగా తిప్పేశాయి. ఇపుడు మోడీ ఆ పనిచేస్తారని కూటమి నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారు

Read more!

అయితే మార్చి 16న కూటమి ఉమ్మడి సభ చిలకలూరిపేటలో జరిగితే మోడీ పాల్గొన్నారు. ఆనాడు మోడీ ప్రసంగం అంతా కూడా ఎన్డీయే సర్కార్ మళ్లీ రావాలని నాలుగు వందల ఎంపీ సీట్లు గెలుచుకోవాలని సాగింది. అప్పట్లో ఏమీ వివాదాలు కూడా లేవు. అయితే ఆ తరువాత చూస్తే నరేంద్ర మోడీ బీజేపీ అగ్ర నేత అమిత్ షా సౌండ్ పెంచేసారు.

ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణాలో మోడీ ఎన్నికల సభలలో పాల్గొన్నపుడు కూడా తన కంఠంలో ప్రాణం ఉండగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడం జరగదు అని ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో బీజేపీ ఎంతటి పట్టుదలగా ఈ విషయంలో ఉందో అర్ధం అవుతోంది.

మోడీ దేశంలో ఎక్కడ ఈ అంశం గురించి మాట్లాడినా ఎన్డీయే మిత్రులు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. పైగా ఈ రిజర్వేషన్ల మీద బీజేపీ లైన్ కి భిన్నంగా ఎవరూ మాట్లాడటం లేదు కూడా. కానీ ఏపీలో అయితే చంద్రబాబు మాత్రం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అంటున్నారు. అంతే కాదు ముస్లిం లకు హజ్ యాత్రకు ఒక్కొక్కరికీ లక్ష వంతున ఆర్థిక సాయం చేస్తామని అంటున్నారు. అనేక ఇతర వరాలు ఇచ్చేశారు.

ఆయన కూటమిలో ఉన్నా ముస్లిం ఓట్ల కోసం సొంత అజెండాతో సాగుతున్నారు. ఇక మోడీతో పంచుకునే మూడు సభలలో చంద్రబాబు ఏమి మాట్లాడుతారు అన్నది చూడాలి. ఆయన వరకూ అయితే ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన తేరు. అది ఆయన మార్క్ చాణక్యం. కానీ దేశమంతా తిరుగుతూ అదే తమ సరికొత్త నినాదంగా చేసుకున్న మోడీ ఏపీలో ఆ మాట అనకుండా ఉంటారా అన్నదే కూటమిలో టెన్షన్. మోడీకి నచ్చచెప్పి అలా అనవద్దు ఏపీలో మాత్రం ఆ ఒక్క మాట వద్దు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.

మోడీ పట్టుదల కూడా అందరికీ తెలుసు. పైగా మతపరమైన రిజర్వేషన్లు ఉండరాదు అన్నది బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ. ఎవరో కోసం అది వారు మార్చుకోరు. దాంతో మోడీ ఏపీకి వస్తున్నారు అంటే ఆనందం ఉంది. దాంతో పాటు ఈ విషయం ఎక్కడ టచ్ చేస్తారో అన్న టెన్షన్ కూడా కూటమి పెద్దలకు ఉంది అని అంటున్నారు. ఏపీలో మోడీ ఈ విషయం మాట్లాడకపోతే మాత్రం బీజేపీ ఫిలాసఫీ మీద అనుమానాలు కూడా రావచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News