పాక్ లో భారత సంతతికి రెడ్ కార్పెట్... భిక్షాటనకు కొత్త మార్గమంట!
నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా బంగా విభజనకు ముందు తన తల్లితండ్రులు నివసించిన ఖుషాబ్ కు వెళ్లారు.;
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానం దాదాపు చాలా మందికి తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే, ప్రపంచ బ్యాంక్ (డబ్ల్యూబీ) కనికరిస్తే బండి నడుస్తున్న పరిస్థితి! ఈ క్రమంలో పాకిస్థాన్ విదేశీ రుణం సుమారు 135 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.11 లక్షల కోట్లు కాగా... ఇందులో ఐదో వంతు ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన అప్పే! అలాంటి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఆ దేశానికి వస్తే ఎలా ఉంటుంది..? అలాగే ఉంది రిసీవింగ్.. దీనిపై తీవ్ర సెటైర్లు వెలువడుతున్నాయి!
అవును... భారత సంతతికి చెందిన ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా పాకిస్థాన్ కు వ్యక్తిగత పర్యటనకు రాగా... ఆయనకు అద్భుతమైన స్వాగతం దక్కింది. ఇందులో భాగంగా... అజయ్ బంగాను పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, పంజాబ్ మైనార్టీ వ్యవహారాల మంత్రి స్వయంగా స్వాగతం పలికారు. ఈ సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి, నవాజ్ షరీఫ్ తో అజయ్ బంగా చిత్రాలు ఉన్న బ్యానర్లు రోడ్లపై కనిపించాయి. ఈ సమయంలో గుర్రపు స్వారీ ఎస్కార్ట్లు, కవాతు బృందాలు అజయ్ బంగా కాన్వాయ్ కు నాయకత్వం వహించాయి.
అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే... అతని కాన్వాయ్ వెళ్లే వీధిలో పెద్ద ఎత్తున విద్యార్థులు వరుసలో నిల్చుని ఉన్నారు. దీంతో.. ఇది ప్రపంచ నాయకుడి కంటే ఎక్కువ స్వాగతం అని ఒకరంటే.. పాక్ ఆర్థిక పరిస్థితికి ఇది ఒక నిదర్శనమనే కామెంట్లు మరికొంతమంది నుంచి వినిపిస్తున్నాయి! ఈ సందర్భంగా పాక్ ప్రధాని పక్కన కాలుపై కాలు వేసుకుని అజయ్ బంగా కూర్చుంటే.. ఆయన ముందు స్కూలు పిల్లాడి ఫోజులో షరీఫ్ కూర్చున్నారంటూ కూడా సెటైర్లు పడుతున్నాయి!
ఇదే సమయంలో.. ఓ బ్యాంక్ ఉద్యోగికి విస్తృతమైన ప్రోటోకాల్ దక్కడం తమ ఆర్థిక పరిస్థితిని అద్ధం పడుతుందంటూ పాకిస్థానీలు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా... ‘మరోసారి భారత సంతతికి చెందిన వ్యక్తికి పాకిస్థాన్ తలవంచుకుని భిక్షాటన చేస్తోంది.. డిసెంబర్ 16, 1971 నాటి వైబ్రేషన్స్ లాంటిదే ఇది కూడా’ అంటూ.. బంగ్లాదేశ్ విముక్త యుద్ధంలో భారత్ ముందు ఇస్లామాబాద్ లొంగిపోవడాన్ని ప్రస్థావిస్తూ మరికొంతమంది నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇదే సమయంలో.. భారత్ పై పాక్ కు ఎంత ద్వేషం ఉన్నా.. భారత సంతతికి చెందిన వ్యక్తి అప్పు చెక్కును నియంత్రిస్తుండటమే ఈ రెడ్ కార్పెట్ వెల్ కమ్ కి కారణమని.. భిక్షాటనకు సరికొత్త మార్గమని మరొకరు స్పందించారు.
అజయ్ బంగా పాక్ ఎందుకు వెళ్లారు!?:
నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా బంగా విభజనకు ముందు తన తల్లితండ్రులు నివసించిన ఖుషాబ్ కు వెళ్లారు. అతని తండ్రి హర్భజన్ సింగ్ బంగా 1947లో భారత్ కు వచ్చారు. తర్వాత భారత సైన్యంలో అధికారిగా పని చేశారు. ఈ క్రమంలో 1957లో మహారాష్ట్రలోని పూణేలో అజయ్ బంగా జన్మించారు. ఇలా ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి అయినా.. పాక్ సైతం తమలో ఒకరిగా అజయ్ ను భావిస్తుంది. అది పూర్తిగా ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకునే కావొచ్చు!
బంగాకు ఘన స్వాగతం వెనుక సింధు జలాల ఒప్పందం!:
1960లో భారత్ - పాక్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగినప్పుడు ప్రపంచ బ్యాంక్ కూడా ఒక ఫెసిలిటేటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమం అనంతరం భారత్.. ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ సందర్భంగా స్పందించిన భారత ప్రధాని.. రక్తం, నీరు కలిసి ప్రయాణించలేవని వ్యాఖ్యానించారు! ఇది ఆ దేశానికి అతిపెద్ద షాక్ గా మారింది.
ఎందుకంటే... పాకిస్థాన్ వ్యవసాయంలో సుమారు 80% ఈ సింధూ జలాలపైనే ఆధారపడుతుండగా.. ఈ రంగం పాక్ జీడీపీలో దాదాపు 25%! దీంతో.. భారత్ నిర్ణయం అనంతరం పాకిస్థాన్ ప్రపంచ వేదికలపై తమ బాధను వెళ్లగక్కుకుంటూ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం! ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు నాయకత్వంలో అయినా ప్రయోజనం దక్కుతుందేమోనని బంగాకు ఘన స్వాగతం పలికిందని అంటున్నారు!