స్మిత వర్సెస్ పోలీసులు.. పెరుగుతున్న వివాదం!
తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంపై స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది.;
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్.. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారన్న చర్చ కొన్నాళ్లుగా ఉంది. దివ్యాంగులకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత స్థాయి ఉద్యోగాలు అవసరమా? అంటూ.. కొన్నాళ్ల కిందట.. ప్రత్యేక వివాదంలో వేలు పెట్టిన స్మితా సబర్వాల్.. నెటిజన్ల నుంచి ఘాటుగా తిట్టించుకున్నారు. ఒకరిద్దరు.. దివ్యాంగుల ఫోరమ్‌లో కేసు వేసేందుకు రెడీ అయ్యారు. ఆ వివాదం కొందరు అధికారుల జోక్యంతో ఆగిపోయింది.
తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంపై స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒకవైపు సర్కారు.. సామాజిక వేత్తలు, రాజకీయనాయకులకు మధ్య ఈ వ్యవహారం వివాదంగా మారి కోర్టుల వరకు వెళ్లింది. ఇలాంటి సమయంలో ఎవరో చేసిన ట్వీట్‌ను ఈమె రీట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లను నరుకుతున్న సమయంలో కొన్ని వన్యప్రాణులు.. జేసీబీకి ఎదురుగా నిలబడి ఉన్నట్టుగా ఆఫొటో ఉంది.
తమను కాపాడాలని.. తమ ప్రాణాలను తీయొద్దని.. జేసీబీ డ్రైవర్‌ను వన్యప్రాణులు వేడుకున్నట్టుగా ఉన్న ఈఫొటో మార్ఫింగ్ చేశారు. దీనిని తెలిసో తెలియకో.. స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వ అధికారి అయి ఉండి.. ఇలాంటి వాటిని రీట్వీట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. తాజాగాశనివారం ఆమె విచారణకు కూడా హాజరయ్యారు.
అనంతరం.. ఆమె చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి. ``నేను చేసి రీట్వీట్‌ను మరో 2 వేల మంది వరకు రీట్వీట్ చేశారు. మరి వారిని కూడా విచారిస్తున్నారా? లేక నన్నే టార్గెట్ చేశారా? టార్గెట్ చేసుకున్న వారినే పిలుస్తున్నారా? చట్టం అందరికీ సమానమా? లేక కొందరికే సమానమా?`` అని నిలదీసినట్టు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఐపీఎస్‌లు మండిపడుతున్నారు. సీనియర్ అధికారి అయి ఉండి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి.. రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.