మారాల్సింది మనమే! జనసేనాని క్లాస్

జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లాస్ పీకారు.;

Update: 2026-03-25 08:14 GMT

జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లాస్ పీకారు. తన సహజ సిద్ధమైన శైలికి భిన్నంగా పార్టీ నేతల భవిష్యత్తు కార్యాచరణపై పవన్ హితబోధ చేశారు. ఎవరినీ నొప్పించకుండానే, వారేం తప్పులు చేస్తున్నారనేది తెలుసుకునేలా పవన్ మాట్లాడిన తీరు చర్చనీయంశంగా మారింది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటువంటి వాటివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్న భావనతోపాటు వ్యక్తిగతంగా వారి రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అవుతోందని పవన్ అభిప్రాయపడ్డారని అంటున్నారు. దీంతో పార్టీ నేతల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారని, ఇక మారాల్సింది మనమే అంటూ కర్తవ్యాన్ని గుర్తు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

విజయవాడలో బుధవారం జరిగిన జనసేన పార్టీ కీలక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ నాయకుడైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా వ్యక్తిగతంగా వారు చేసే పనుల వల్ల పార్టీకి ఇబ్బందులు రావడానికి వీల్లేదని పవన్ తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హితబోధ చేశారు పవన్. ఇటీవల కాలంలో జనసేన నేతలుపై వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తిరుపతికి చెందిన కిరణ్ రాయల్, శ్రీకాళహస్తికి చెందిన వినుత వంటి వారు వ్యక్తిగత వివాదాలతో రాజకీయంగా ఇబ్బందులకు గురయ్యారు.

అయితే సమావేశంలో ఆ నాయకులు పేర్లు ప్రస్తావించకుండానే జనసేనాని పవన్ చురకలు అంటించే ప్రయత్నం చేశారని అంటున్నారు. నేతలు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకుని పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూటమి నేతల మధ్య సమన్వయంపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కుటుంబంలో ఎలాగైతే చిన్నచిన్న మనస్పర్థలు వస్తాయో.. ఉమ్మడి పాలనలోనూ అదేరకమైన ఇబ్బందులు వస్తాయని అంతా సర్దుకుని పనిచేయాల్సిందేనని పవన్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లతోపాటు గోదావరి జిల్లాల్లోని రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు టీడీపీ నేతలతో వివాదాలు పెట్టుకోడాన్ని పవన్ పరోక్షంగా హెచ్చరించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొద్దిమంది కీలక నేతలను మాత్రమే పిలిచిన ఈ సమావేశంలో పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు కారణమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, అనుచరులను ఎంతవరకు వాడుకోవాలి అన్నది మీరే తేల్చుకోవాలని పవన్ సూటిగా చెప్పారు. ఎవరైనా క్రమశిక్షణ తప్పితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నేతలను కలుపుకుని వెళ్లే విషయంలో జనసేన నుంచి ఏ చిన్న తప్పుకూడా జరగడానికి వీలులేదని పవన్ తేల్చిచెప్పారు. దీంతో నియోజకవర్గాల్లో రాజకీయంగా వెనుకాముందు చూడకుండా దూకుడు చూపుతున్న నేతలకు పవన్ చురకలు అంటించారని అంటున్నారు. పవన్ అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారని, పార్టీ క్రమశిక్షణ అతిక్రమిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News