ట్రంప్ మళ్లీ కెలికాడు.. మెలోని మళ్లీ ఇచ్చిపడేసింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్ర కలకలం రేపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం అంతర్జాతీయ వేదికపై మరోసారి తీవ్ర కలకలం రేపింది. మరోసారి ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు అగ్రదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ సమాజం ఆగ్రహంతో ఊగిపోతుండగా.. ప్రధాని మెలోని తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. "నేను ఎవరి ముందూ తలవంచే ప్రసక్తే లేదు" అంటూ ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అసలేం జరిగింది? వివాదానికి కారణమిదే!
ఇటలీకి చెందిన 'లా7' టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పరుష పదజాలంతో మాట్లాడారు. గతంలో ఒక కార్యక్రమం సందర్భంగా ప్రధాని మెలోనితో జరిగిన భేటీ గురించి ప్రశ్నించగా.. ట్రంప్ అత్యంత అహంకారపూరితంగా స్పందించారు. "మీ ప్రధాని నాతో ఫోటో దిగేందుకు తీవ్రంగా ఆరాటపడ్డారు. నిజానికి నాకు ఆమెతో ఫోటో దిగడం ఇష్టం లేదు. కానీ ఆమెను చూసి జాలిపడి ఒప్పుకున్నాను. నేను మాట్లాడినందుకు ఆమె సంతోషపడి ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఆమెతో మాట్లాడాల్సిన అవసరమే లేదు" అంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒక దేశ మహిళా ప్రధానిని ఉద్దేశించి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటలీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇది మెలోని వ్యక్తిగత గౌరవానికే కాకుండా ఇటలీ దేశ సార్వభౌమత్వానికే అవమానమని అక్కడి ప్రజలు, రాజకీయ నేతలు మండిపడుతున్నారు.
"ఎవరి ముందూ మోకరిల్లను" ఇచ్చిపడేసిన మెలోని..
ట్రంప్ వ్యాఖ్యలపై ఇటాలియన్ మీడియాలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో జార్జియా మెలోని గట్టిగా స్పందించారు. తాను అమెరికాకు వ్యతిరేకిని కాదని చెబుతూనే, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పాశ్చాత్య దేశాలన్నీ ఐక్యంగా ఉంటేనే ప్రపంచ వేదికపై బలంగా నిలబడగలవని, ఆ కూటమిలో ఇటలీ కీలక పాత్ర పోషిస్తుందని మెలోని అన్నారు. అయితే బలమైన మైత్రి అనేది ఎప్పుడూ పరస్పర గౌరవం, నిజాయితీ, స్పష్టమైన సంభాషణలపైనే ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు. తాను ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నాయకురాలినని.. అవసరమైతే మిత్రదేశాలైనా సరే.. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు వ్యక్తపరుస్తానని, ఎవరి ముందూ మోకరిల్లే ప్రసక్తే లేదని ట్రంప్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరిక పంపారు.
పర్యటన రద్దు చేసుకున్న ఇటలీ విదేశాంగ మంత్రి
ఈ వివాదం కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా దౌత్యపరమైన సంబంధాలపై కూడా ప్రభావం చూపింది. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో మయామిలో జరగాల్సిన ప్రతిష్టాత్మక 'బిజినెస్ ఫోరమ్'కు ఆయన హాజరుకావాల్సి ఉండగా.. ఈ పరిణామాల నేపథ్యంలో పర్యటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన తజాని.. "ప్రధాని జార్జియా మెలోనిపై ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు కేవలం ఆమెను మాత్రమే కాదు, ఇటలీ దేశ గౌరవాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీశాయి" అని మండిపడ్డారు.
అంతర్జాతీయ విశ్లేషకుల ఆందోళన
అమెరికా, ఇటలీ రెండు దేశాలూ నాటో కూటమిలో కీలక భాగస్వామ్య దేశాలు. అయినప్పటికీ పరస్పర గౌరవం, దౌత్య మర్యాదలను పాటించడంలో ట్రంప్ విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, రానున్న రోజుల్లో ఇరు దేశాల నాయకత్వం ఈ వివాదాన్ని ఎలా సర్దుమణిగిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.