రెండు ఆడ పులులు తీసుకొస్తున్న పవన్
ఆయన బీజేపీ ముఖ్యమంత్రి ఈయన జనసేన ఉప ముఖ్యమంత్రి. ఇద్దరూ ఎన్డీయేలో భాగస్వాములు. దాంతో ఈ భేటీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది అని అంటున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై పర్యటనలో ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన భుజానికి అయిన గాయం విషయంలో వైద్య సాయం కోసం ముంబైకి వెళ్ళారు. ఈ సందర్భంగా పవన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఆసక్తికరమైన భేటీ నిర్వహించారు. ఆయన బీజేపీ ముఖ్యమంత్రి ఈయన జనసేన ఉప ముఖ్యమంత్రి. ఇద్దరూ ఎన్డీయేలో భాగస్వాములు. దాంతో ఈ భేటీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది అని అంటున్నారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ఏపీకి రెండు ఆడ పులులు :
పవన్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న సంగతి విధితమే. ఈ భేటీలో కూడా ఆయన ఏపీ ప్రయోజనాల గురించే చర్చించారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయని అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఏపీ మహారాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని కూడా ఇద్దరు నాయకులు నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మహా సహకారం :
ఈ క్రమంలో ఏపీలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకునే విషయంలో పవన్ చొరవ చూపించారు. అందుకే ఆయన ప్రత్యేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో సమావేశం అయ్యారు. దాంతో ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక ఏపీలోని తూర్పు కనుమలలో పులుల సంరక్షణ అన్నది అతి పెద్ద చర్యగా ఉండబోతోంది. మహారాష్ట్ర నుంచి తెచ్చే రెండు ఆడ పులులు తూర్పు కనుమలలో ప్రవేశంతో అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడం తో పాటు జన్యు వైవిధ్యం పెరుగుతుంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న కాలంలో పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి ఈ చర్యలు దోహదపడతాయని అంటున్నారు. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని కూడా అంటున్నారు.
థాంక్స్ అన్న పవన్ :
ఏపీకి రెండు ఆడ పులులను ఇచ్చినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. శాస్త్రీయ విధానాలు స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఏపీ మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏపీకి నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి కూడా పవన్ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. మొత్తానికి పవన్ ఊరకే మహారాష్ట్ర నుంచి రావడం లేదు, రెండు ఆడ పులులను వెంట తీసుకుని వస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ నిబద్ధతకు ఏపీ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియచేయాల్సిందే అని అంటున్నారు.