125 ఏళ్లలోనే దారుణం.. జూన్ వానలకు ఎల్‌నినో బ్రేక్!
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆరంభం కోట్లాది మంది రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది.
ఆకాశం వైపు చూసి చూసి కళ్లు కాయలు కాస్తున్నా.. మబ్బు తునకైనా కనిపించని వైనం. పొలం గట్టున కూర్చొని, నెర్రెలు బారిన భూమిని చూస్తూ గుండె లయ తప్పుతున్న అన్నదాతల ఆవేదన..
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆరంభం కోట్లాది మంది రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎల్‌నినో రక్కసి ప్రభావంతో వాతావరణం ముఖం చాటేయడంతో.. గడిచిన 125 ఏళ్లలోనే అత్యంత దారుణమైన, ఎన్నడూ లేనంత తక్కువ జూన్ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి తొలకరి చినుకులతో పులకించి.. పచ్చని పసిడి పంటలతో కళకళలాడాల్సిన పొలాలు.. నేడు వానల్లేక వెలవెలబోతున్నాయి. విత్తనం మొలకెత్తక, జలాశయాలు అడుగంటిపోతుండటంతో.. రాబోయే రోజుల్లో కడుపు నింపే ఖరీఫ్ పంటల పరిస్థితి ఏంటో తెలియక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వర్షపాతం భారీగా తగ్గింది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో అసాధారణ మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల జూన్ నెలలో నమోదైన వర్షపాతం గత 125 ఏళ్లలోనే అత్యల్ప స్థాయికి పడిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురవాల్సి ఉండగా ఈసారి చాలా రాష్ట్రాల్లో వానలు ఆలస్యంగా రావడం.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి? 43 శాతం లోటు!
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 1 నుంచి 28వ తేదీ వరకు దేశంలో సాధారణంగా $149.8 మి.మీల వర్షపాతం నమోదవ్వాలి. కానీ, ఈసారి కేవలం $85.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే సాధారణ స్థాయితో పోలిస్తే ఏకంగా 43 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఇది గత శతాబ్దానికి పైగా కాలంలో నమోదైన అత్యల్ప జూన్ వర్షపాతాల్లో ఒకటిగా రికార్డులకెక్కింది.
చరిత్రను పరిశీలిస్తే కూడా ఇంత తక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. 1905లో 87.4 మిల్లీమీటర్లు, 1926లో 100 మిల్లీమీటర్లు, 2009లో 87.5 మిల్లీమీటర్లు, 2014లో 95.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది నమోదైన 85.2 మిల్లీమీటర్ల వర్షపాతం వాటన్నింటికంటే తక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
తీవ్ర వర్షాభావంలో 315 జిల్లాలు.. ఖరీఫ్‌పై ప్రభావం
దేశంలోని మొత్తం 724 జిల్లాల్లో దాదాపు 315 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రాష్ట్రాల్లో ఈ పరిస్థితి రైతులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. వానలు పడకపోవడంతో విత్తనాల విత్తకం పూర్తిగా ఆలస్యమైంది. ఇప్పటికే సాగునీటి కొరత ఏర్పడడమే కాకుండా.. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. వర్షాలు మరికొన్ని రోజులు ఇలాగే ముఖం చాటేస్తే ఈ ఏడాది ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఎల్‌నినో ప్రభావం భారతదేశంలో నైరుతి రుతుపవనాల వేగం, విస్తరణను పూర్తిగా దెబ్బతీసింది. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో వాతావరణ నమూనాలు మారిపోయి వర్షాలు ముఖం చాటేశాయి." అని చెబుతున్నారు.
ముందున్న సవాళ్లు.. నిపుణుల సూచనలు
ప్రస్తుతం నెలకొన్న పొడి వాతావరణ పరిస్థితులు కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా, తాగునీటి లభ్యత, జలవిద్యుత్ ఉత్పత్తి వంటి కీలక రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే రాబోయే వారాల్లో రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అప్పటివరకు రైతులు తొందరపడి విత్తనాలు వేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను బట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు యోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నీటి నిర్వహణ, తాగునీటి సరఫరా, ముందస్తు సాగు ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు ఆకాశం వైపే ఉంది.