కాంగ్రెస్ సరే.. బీఆర్ ఎస్‌పై మౌనం: బీజేపీ స్ట్రాటజీ మారిందా?
వాస్తవానికి బీజేపీ ఎక్కడ అడుగు పెట్టాలని అనుకున్నా.. ఏ రాష్ట్రంలో ఎదగాలని భావించినా.. అక్కడి అధికార, ప్రతిపక్షాలను కార్నర్ చేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేంద్రంగా వరంగల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీ యంగా చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసుకున్న నితిన్ ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌ని పన్నెత్తు మాట అనకపోవడం.. ఆపార్టీ పాలనపైనా ఆయన పెదవివిప్పకపోవడం వంటివి ఆసక్తిగా మారాయి. వాస్తవానికి బీజేపీ ఎక్కడ అడుగు పెట్టాలని అనుకున్నా.. ఏ రాష్ట్రంలో ఎదగాలని భావించినా.. అక్కడి అధికార, ప్రతిపక్షాలను కార్నర్ చేస్తుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ.
కానీ, దీనికి భిన్నంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబీన్.. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనను కూడా తూర్పార బట్టారు. తెలంగాణలో పేదలను, రైతులను గాలికి వదిలేశారని.. కేంద్రం పట్టించుకుంటోంది కాబట్టి .. వారికి పలు పథకాలు అమలవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా గాలికి వదిలేశారని అన్నారు. ముఖ్యంగా పీవీ నరసింహారావును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నరసింహారావుకు తగిన గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు.
ఢిల్లీలో ఆయన భౌతిక దేహాన్ని కూడా పార్టీ కార్యాలయంలోకి తీసుకురాలేదని, కానీ, తాము ఆయనను పూర్వ ప్రధానిగా ఎంతో గౌరవించామన్నారు. ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని.. కానీ, సోనియా అడ్డు పడుతున్నార ని ఏమాత్రం తమకు సహకరించడం లేదని కూడా నితిన్ చెప్పుకొచ్చారు. కాగా.. వరంగల్ గడ్డపై ఇలా పీవీకి మద్దతుగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే చర్చ జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో వరంగల్‌లో కాషాయ జెండా ఎగరాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం గమనార్హం.
బీఆర్ ఎస్‌పై మౌనం..
ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రస్తుతానికి తెలియక పోయినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికలనాటికి ఇరు పక్షాలు కలిసి ముందుకు వెళ్లే వ్యూహాలు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు బీజేపీ తో చేతులు కలిపే ప్రతిపాదన.. కూడా బీఆర్ ఎస్ వర్గాల్లో ఉందని అందుకే.. బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ ఒంటరి పోరు చేస్తే.. మరోసారి పరాభవం తప్పదన్న చర్చ గత కొన్నాళ్లుగా వినిపిస్తుండడం దీనికి దన్నుగా నిలిచింది. మరి అందుకే నితిన్ నబీన్.. మౌనంగా ఉన్నారా? అనేది ప్రశ్న.