జనసేన సీట్లు వారికే రిజర్వ్ ...ఇక అంతే !

గతంలో లేని విధంగా రెండు నెలల నుంచి పార్టీ మీదనే పవన్ వర్క్ చేస్తున్నారు. అందుకే అనేక సంచలన కీలక నిర్ణయాలు ఆ పార్టీ అధినాయకత్వం నుంచి వెలువడ్డాయి.

Update: 2026-06-30 07:28 GMT

జనసేన తన లోపాలను తీర్చిదిద్దుకునే పనిలో పడింది. గతంలో చేసిన పొరపాట్లను అసలు చేయకూడదని డిసైడ్ అయింది. తొందరలో జరగబోతున్న స్థానిక ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జనసేన భావిస్తోంది. దాంతో గ్రాస్ రూట్ లెవెల్ లో పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలని గట్టి సంకల్పం తీసుకుంది. ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ అయితే పూర్తి సీరియస్ గానే ఫోకస్ పెట్టేశారు. గతంలో లేని విధంగా రెండు నెలల నుంచి పార్టీ మీదనే పవన్ వర్క్ చేస్తున్నారు. అందుకే అనేక సంచలన కీలక నిర్ణయాలు ఆ పార్టీ అధినాయకత్వం నుంచి వెలువడ్డాయి.

జాయినింగ్స్ కమిటీ తోనే :

జనసేనలోకి నేతలు చేరుదామని గతంలో అనుకున్నారు, కానీ వారికి గేట్లు తెరవలేదు, వివిధ కారణాల రీత్యా బయట పార్టీల నుంచి జంపింగులను జనసేన పెద్దగా ప్రోత్సహించడం లేదు. అయితే ఇటీవల కాలంలో జనసేన ఆలోచనలలో గణనీయమైన మార్పు వచ్చింది. బలమైన నాయకులు గత ట్రాక్ రికార్డు కరెక్ట్ గా ఉన్న వారు సేవ చేయాలని చూసే వారిని తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవచ్చు అని యోచిస్తోంది. దాంతో జనసేన జాయినింగ్స్ కమిటీని ముందుకు తీసుకుని వచ్చారు. దీని వెనక ఉన్న వ్యూహాలు కనుక చక్కగా వర్కౌట్ అయితే జనసేనకు తిరుగు ఉండదని అంటున్నారు.

భూతద్దంతో వెతికి పట్టి :

ఇక మొత్తం 28 జిల్లాలకు సంబంధించి జనసేన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సారధ్యం సీనియర్లకు అప్పగించింది. ఈ కమిటీలు అన్నీ పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు ఏమిటి అన్నది ఆరా తీసి మరీ పూర్తి సమగ్రమైన నివేదికను తయారు చేస్తాయి. పార్టీలో ఆరుగాలం కష్టపడిన వారిని భూతద్దంలో వెతికి వెలికి తీసి మరీ ఆణి ముత్యాల జాబితాను అధినాయకత్వం ముందు ఉంచుతాయి. ఆ విధంగా రాటు దేలిన నిబద్ధతతో కూడిన గ్రౌండ్ లెవెల్ నాయకత్వం అధినాయకత్వం ముందుకు వస్తుంది. వారి నుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి పార్టీ పదవులు ముఖ్య బాధ్యతలు వారికే అప్పగించడానికి జనసేన హై కమాండ్ సిద్ధం అవుతోంది. ఇప్పటికే జనసేన సభ్యత్వం 20 లక్షల పై దాకా పెరిగిన నేపధ్యం ఉంది. ఉద్యమి సాధిక్ లను జనసేనలో క్రియాశీలం చేశారు. ఇపుడు సమర్ధ నాయకులను జనసేన జెండా అంటే అంకితభావం పెంచుకుని పుష్కర కాలంగా పనిచేస్తున్న వారిని దగ్గరకు తీసి పదవులు అప్పగించాలని జనసేన తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీలో ఎంతో మందికి ఉత్తేజ పూరితం కానుంది అని అంటున్నారు.

వారికే టికెట్లు కూడా :

రానున్న స్థానిక ఎన్నికలు కానీ ఆ మీదట మూడేళ్ళ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికలు కానీ జనసేనలో మొదటి నుంచి ఉన్న వారు జెండా ఎత్తిన వారికే బంగారం లాంటి అవకాశాలు అని పార్టీ స్పష్టం చేయదలచుకుంది. దీంతో ఒక విధంగా జనసేన లో ఆది నుంచి పనిచేసే వారికి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసే వారికి చాన్స్ ఇస్తే పది కాలాల పాటు పార్టీ బ్రహ్మాండంగా మనుగడ సాగిస్తుంది అన్నదే జనసేన నయా ఆలోచనలు అని చెబుతున్నారు. దాంతో జనసేనలో టికెట్లు కానీ అవకాశాలు కానీ పదవులు కానీ అసలైన క్యాడర్ కే రిజర్వ్ అయిపోయాయని అంటున్నారు. దాంతో పార్టీకి కూడా మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. మొత్తానికి 2014లో గాజు గ్లాస్ పట్టుకున్న వారివే రానున్న రోజులు అన్నీ అని అంటున్నారు. ఇది నిజంగా వారందరికీ గుడ్ న్యూస్ మరి.

Tags:    

Similar News