ఆస్థిపంజరం ఇష్యూ: బ్యాంక్ అధికారులపై చర్యలు అక్కర్లేదన్న బాధితుడు

మరణించిన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కోసం ఒక గిరిజనుడు బ్యాంక్ చుట్టూ తిరగటం.. నిబంధనల పేరుతో వారు అతడికి చుక్కలు చూపించటం.. విసిగిన అతను ఏకంగా తన సోదరి సమాధిని తవ్వి..ఆస్థి పంజరాన్ని భుజాన ఎత్తుకొని బ్యాంక్ వద్దకు సాక్ష్యంగా తీసుకొచ్చిన వైనం యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది.;

Update: 2026-05-04 04:46 GMT

మరణించిన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కోసం ఒక గిరిజనుడు బ్యాంక్ చుట్టూ తిరగటం.. నిబంధనల పేరుతో వారు అతడికి చుక్కలు చూపించటం.. విసిగిన అతను ఏకంగా తన సోదరి సమాధిని తవ్వి..ఆస్థి పంజరాన్ని భుజాన ఎత్తుకొని బ్యాంక్ వద్దకు సాక్ష్యంగా తీసుకొచ్చిన వైనం యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. సామాన్యుల విషయంలో బ్యాంకులు ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తాయనే దానికి నిదర్శనంగా ఈ ఉదంతం నిలిచింది.

నిబంధనల పేరుతో బ్యాంక్ అధికారులు అడిగేవన్నీ సమకూర్చటం పలుసందర్భాల్లో తలకు మించిన భారంగా మారుతుంది. అలాంటి వేళ.. తాను చేసిన దానికి భిన్నంగా ఎలాంటి పరిష్కారం లేదనే అతడి తీరు భారీ చర్చకు తెర తీసింది. ఈ ఉదంతం తర్వాత బ్యాంక్ స్పందించిందా? ప్రభుత్వం ఎలా రియాక్టు అయ్యింది? సదరు గిరిజనుడికి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు అందాయా? అతడి చుట్టుపక్కల వారు ఎలా స్పందించారు? ఇప్పుడు అతడి కుటుంబ పరిస్థితేంటి? బ్యాంక్ అధికారులపై అతడేం చెబుతున్నాడన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

ఒడిశాకు చెందిన జీతూ ముండా అనే గిరిజనుడి ఉదంతంలోకి చూస్తే.. చనిపోయిన తన అక్క ఖాతాలో డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవటానికి కాళ్లు అరిగేలా బ్యాంక్ చుట్టూ తిరిగిన అతడికి.. అక్క ఆస్థిపంజరాన్ని నేరుగా బ్యాంక్ కు తీసుకొచ్చిన వైనంతో బ్యాంక్ సైతం కదిలింది. చివరకు బ్యాంక్ సిబ్బందే.. నేరుగా అతడి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి అతడికి ఇవ్వాల్సిన డబ్బులు.. దాని మీద వచ్చిన వడ్డీ (రూ.19,402) మొత్తాన్ని చెల్లించారు. ఆ డబ్బుల్ని జీతూ ముండా కుటుంబం మూడు భాగాలుగా పంచుకున్నారు.

తన సోదరితో తనకు మంచి అనుబంధం ఉందన్న ఆయన.. తామంతా ఒకే ఇంట్లో నివసించినట్లుగా చెప్పారు. ఆమె అనారోగ్యానికి గురై.. మంచానికే పరిమితమైనప్పుడు తానే వంట చేసి.. తినిపించేవాడినని చెప్పిన అతను.. ఆమె మరణం తీరని లోటుగా పేర్కొన్నారు. తాను చేసిన పనిని పలువురు తప్పు పడుతున్నా.. తనకు అంతకుమించిన మార్గం మరొకటి లభించలేదన్నారు. తాజాగా తాను మరోసారి గిరిజన సంప్రదాయం ప్రకారం తన సోదరి అంత్యక్రియల్ని నిర్వహిస్తానని పేర్కొన్నారు.

సమాధి నుంచి ఆస్థి పంజరాన్ని వెలికి తీసినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్న అతను.. ‘‘చనిపోయిన వ్యక్తి అవశేషాల్ని వెలికి తీయటం తప్పని కొందరంటున్నారు. కానీ.. నాకు మరో మార్గం కనిపించలేదు. బ్యాంక్ కు సోదరి ఆస్థి పంజరాన్ని తీసుకెళ్లిన తర్వాత ప్రజల నుంచి రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది. నేను బ్యాంక్ కు ఆస్థి పంజరాన్ని తీసుకెళ్లి ఉండకపోతే.. బ్యాంక్ వారు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేవారు కాదు. ఈ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. బ్యాంక్ సిబ్బంది తీరుతో విసిగిపోయి మాత్రమే ఇలా చేశాను. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవటం లేదు. సమస్య తీరిపోయిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకోవటంలో అర్థమేం ఉంది?’’ అంటూ ప్రశ్నించారు.

ఈ నెల ఆరో తేదీన గ్రామస్థులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన అతను.. బ్యాంక్ అధికారులపై ఎలాంటి చర్యలు వద్దన్నారు. అయితే.. జీతూ పెద్ద మనసుతో బ్యాంక్ అధికారులను క్షమించినా.. ప్రభుత్వం మాత్రం వారిని విడిచి పెట్టటం లేదు. వారి పని తీరుపై విచారణ కొనసాగుతోంది. సామాన్యుల విషయంలో బ్యాంకులు అనుసరించే విధానాల్ని మార్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. మరెందరో బాధితులు బ్యాంకుల చుట్టూ అవసరానికి మించి తిరగాల్సిన పని తప్పుతుంది.

Tags:    

Similar News