మంత్రి కొండపల్లి కూడా డ్యూటీ ఎక్కేశారు! కూటమి మంత్రుల్లో మారిన తీరు
కూటమి మంత్రుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడిప్పుడే కొంతమంది కొత్త మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.;
కూటమి మంత్రుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఇప్పుడిప్పుడే కొంతమంది కొత్త మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మంత్రులు సమర్థంగా పనిచేయాలని, జిల్లాలకు నాయకత్వం వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేస్తున్న సూచనలతో కొందరు మంత్రులు పరుగులు తీస్తున్నారు. ఇక సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు తర్వాత మంత్రుల బాధ్యత మరింత పెరిగినట్లు పనిచేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రానికి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు వస్తుండటంతో అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే మంత్రులు తమ శాఖ వ్యవహారాలపై వరుస సమీక్షలతో స్పీడు పెంచారు.
చంద్రబాబు మంత్రివర్గంలో గతంలో ఎన్నడూ లేనట్లు ఈ సారి కొత్తవారికి భారీగా అవకాశాలు ఇచ్చారు. తన కుమారుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన సహచరులుగా ఉంటారని పలువురు యువనేతలకు అవకాశాలిచ్చారు. ఇలా చాన్స్ వచ్చిన కొందరు యువ మంత్రులు కొత్తలో తడబాటుకు లోనయ్యారు. అలాంటి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఓర్పుతో వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఇప్పుడిప్పుడే పాలనపై పట్టుసాధిస్తున్నారు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఒకరు. తొలిసారి ఎమ్మెల్యే అయిన కొండపల్లి మంత్రిగా విజయనగరం జిల్లా బాధ్యతలతోపాటు ఇన్చార్జి మంత్రిగా శ్రీకాకుళం జిల్లాను పర్యవేక్షిస్తున్నారు.
ఇక ఆయనకు ఎన్ఆర్ఐ వ్యవహారాలతోపాటు కీలకమైన చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖను సీఎం అప్పగించారు. సీఐఐ సమ్మిట్ కు ముందు పలు దేశాల్లో పర్యటించి రోడ్ షోలు నిర్వహించి రాష్ట్రాలకు పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేసిన మంత్రి కొండపల్లి ఇప్పుడు సీఐఐ సమ్మిట్ విజయవంతం అయిన తర్వాత సీఎం ఇచ్చిన లక్ష్యాలను చేరుకునేలా దృష్టిపెట్టారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో జిల్లా పరిశ్రమలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రగతి లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామిక వేత్తను తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే అంశంపై అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగా లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే విధంగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు అనుసంధానం చేసి పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన చేయూతనివ్వాలని సూచించారు. సాంకేతికత, నైపుణ్యాభివ్రుద్ది, ఆర్ధిక ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాలపై అధికారులు అందరికి స్పష్టమైన అవగాహన ఉండాలని, అలా ఉన్నప్పుడే, పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమాచారం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రోత్సాహం అందుతుందని మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగిందన్నారు. అవసరమైన మానవ వనరులను, మౌలిక సదుపాయాలను పరిశ్రమల అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని తెలిపిన మంత్రి, శిక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, హబ్ సేవలను సమర్ధవంతంగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారానికి ఒక రోజు.. ఖచ్చితంగా సిబ్బంది అందరూ ఆఫీస్ లో ఉండాల్సి ఉంటుందని, ఫీల్డ్ వర్క్ పైనే కాదు ఆఫీసుల్లో జరిగే కార్యకలాపాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రతి రోజు ఎవరో ఒక అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండి, ఔత్సాహికులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు కాబోయే పరిశ్రమలపై అందరూ దృష్టి సారించాలన్నారు. ప్రతి శనివారం అధికారులు అందరూ అందుబాటులో ఉండాల్సిందేనని, రెండవ శనివారం మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. పారిశ్రామిక వేత్తలను, రిసీవ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాళ్లకు కావాల్సిన సహకారం ఇవ్వాలని సూచించారు.
రుణ సదుపాయాలతో పాటుగా అనుమతుల విషయంలో అధికారులు అందుబాటులో ఉండి వివరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కార్యక్రమాలపై అధికారులు అందరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంటుందని, మారుతున్న పారిశ్రామిక విధానాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువ పరిశ్రమలు రావాలి అంటే మనం మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. ఆచరణలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులను ఇచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకు వెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.