చెల్లి కుంపటి: బాబునైనా తట్టుకోవచ్చు.. జగన్ అంతర్మథనం..!
అయితే.. ఈ విషయంలో అక్కడితోనే ఆమె ఆగిపోలేదు. అనేక విషయాలు ప్రస్తావించారు.;
వైసీపీ అధినేత జగన్ అంతర్మథనంలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునైనా తట్టు కోవ చ్చు.. ఎదురు దాడి చేయొచ్చు.. కానీ, సొంత చెల్లి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిలను మాత్రం తట్టుకోవడం కష్టమని ఆయన కీలక నాయకులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ``ఇదేంగోలబ్బా.. బాబే బెటర్.`` అని జగన్ అన్నట్టు తాడే పల్లి వర్గాలు చెబుతున్నాయి. గురువారం షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీలో మంటలు రేపాయి. వైఎస్ వారసుడు జగన్ కాదని.. తన కొడుకు రాజారెడ్డేనని షర్మిల వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ విషయంలో అక్కడితోనే ఆమె ఆగిపోలేదు. అనేక విషయాలు ప్రస్తావించారు. వైఎస్ గుండెల్లో కత్తి దింపాడని జగన్‌పై నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని కూడా షర్మిల చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. ఇప్పటి వరకు గత ప్రభుత్వ విధానాలు.. తమ ఆస్తుల వ్యవహారం, వివేకానందరెడ్డి దారుణ హత్య వంటివాటిని మాత్రమే.. మాట్లాడుతున్న షర్మిల.. అనూహ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీయేకు ఓటేయడం.. వైఎస్ వారసత్వాన్నే ప్రశ్నిస్తుండడం.. సహజంగానే వైసీపీని ఇరుకున పెడుతోంది.
ఈ విషయంపైనే జగన్ కూడా కలవరపడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు చేసే విమర్శలను రాజకీయంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అదేసమయంలో సర్కారు చేస్తున్న తప్పులను కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్లి.. వాటిపై విమర్శలు చేసి.. అంతో ఇంతో లబ్ధి పొందే అవకాశం కూడా ఉంది. కానీ, షర్మిల విషయంలో నోరు విప్పలేని పరిస్థితి నెలకొందన్నది జగన్ ఆవేదనగా ఉందని సమాచారం. నోరు విప్పి ఏం మాట్లాడినా.. చెల్లి అనే సెంటిమెంటుతోపాటు.. తమను టార్గెట్ చేస్తున్న మీడియా కూడా.. తీవ్రప్రచారం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ ఆవేదన ఇప్పుడే కాదు.. గతంలోనూ.. షర్మిల గురించి జగన్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఆస్తుల విషయంలో చేసిన విమర్శలు, వివేకా హత్యపై చేసిన విమర్శలు వంటివాటిని తిప్పికొట్టలేక.. ఏదైనా మాట్లాడితే.. ఇదిగో చెల్లిని కూడా విమర్శిస్తున్నాడు.. రోడ్డుకు లాగుతున్నాడన్న విమర్శలు పడలేక.. జగన్ తల్లడిల్లిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు ఏకంగా వైఎస్ వారసత్వాన్నే షర్మిల కెలికేసిన నేపథ్యంలో జగన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారితో తన ఆవేదన చెప్పుకొన్నట్టు తెలుస్తోంది.