రూ.80 లక్షల పెన్షన్... స్కర్ట్, బ్లౌజ్ ధరించి చనిపోయిన తల్లిలా నటించాడు!
అవును... చట్టవిరుద్ధంగా తన తల్లి పెన్షన్ వసూలు చేయడానికి తాను మరణించిన తన తల్లిలా వేషం వేసుకున్న ఒక ఇటాలియన్ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.;
వృద్ధాప్యంలో ఉన్న పేద వారి కోసం ప్రభుత్వాలు సామాజిక పెన్షన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రిటైర్డైన ప్రభుత్వ ఉద్యోగులకూ పెన్షన్ వస్తోంది. అయితే చట్టవిరుద్ధంగా తన తల్లి పెన్షన్ పొందడం కోసం ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. తన తల్లి పెన్షన్ కోసం.. మరణించిన అమెలా అతడు వేషం వేసుకున్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
అవును... చట్టవిరుద్ధంగా తన తల్లి పెన్షన్ వసూలు చేయడానికి తాను మరణించిన తన తల్లిలా వేషం వేసుకున్న ఒక ఇటాలియన్ వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అతడు ఇప్పటివరకూ ఈ ప్లాన్ ద్వారా సుమారు రూ.93,000 డాలర్లు (రూ.80 లక్షలు పైనే) సంపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరిచాడు.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర ఇటలీలోని బోర్గో వర్జిలియో పట్టణానికి చెందిన 56 ఏళ్ల మాజీ నర్సు అయిన వ్యక్తి తల్లి గ్రాజియెల్లా డల్ ఓగ్లియో (85) సుమారు మూడేళ్ల క్రితం మరణించారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె పెన్షన్ ను రెన్యువల్ చేయించడానికి స్థానిక రిజిస్ట్రీ ఆఫీసుకు వెళ్లాడు ఆమె కుమారుడు. ఆ సమయంలో అతడు అచ్చుగుద్దినట్లు తన తల్లిలా 1970 నాటి గెటప్ లో రెడీ అయ్యి వెళ్లాడు.
ఇందులో భాగంగా... అచ్చం ఆమెలా కనిపించేందుకు లాంగ్ స్కర్ట్, నాటి మోడల్ బ్లౌజ్, మెడలో ముత్యాల హారం, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, పాతకాలపు ఇయర్ రింగ్స్ ఉపయోగించాడని చెబుతున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ తో సుమారు మూడేళ్ల క్రితమే మరణించిన తన తల్లి పెన్షన్ ను నిరవధికంగా వసూల్ చేస్తూనే ఉన్నాడని.. ఆ మొత్తం 94వేల యూఎస్ డాలర్లని చెబుతున్నారు.
ఈ విధంగా బయటపడింది!:
ఈ సందర్భంగా స్పందించిన బోర్గో వర్జిలియో మేయర్ ఫ్రాన్సిస్కో మాట్లాడుతూ... ఒక రిజిస్ట్రీ ఉద్యోగి గ్రాజియెల్లా రూపంలో అసమానతలను గమనించాడని తెలిపారు. ఇందులో భాగంగా... మెడ కొంచెం మందంగా ఉందని.. ముడతలు వింతగా అనిపించాయని.. దీనికి తోడు చేతులపై చర్మం 85 ఏళ్ల వృద్ధురాలిలా కనిపించలేదని గ్రహించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే... అధికారులు గాజ్రియెల్లా అసలు ఫోటోతో ఇతని ఫోటో పోల్చి చూశారని.. ఈ సమయంలోనే ఏదో మోసం జరిగినట్లు గ్రహించి దర్యాప్తు మొదలుపెట్టారని వెల్లడించారు. ఈ సమయంలో రెన్యువల్ కోసం మరోసారి ఆఫీసుకు రావాలని పిలిచినప్పుడు.. అతడు తన తల్లివేషంలో రాగా.. అదుపులోకి తీసుకుని విచారిస్తే.. మోసాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే... డాల్ ఓగ్లియో ఇంటిని శోధించిన అధికారులకు ఆమె మమ్మీ చేయబడిన మృతదేహాన్ని బెడ్ షీట్లు, స్లీపింగ్ బ్యాగ్ లో చుట్టి ఉండటాన్ని కనుగొన్నారు. అయితే.. ఆమె సహజ కారణాల వల్లే మరణించి ఉండోచ్చని పోలీసులు భావిస్తున్నప్పటికీ.. పోస్ట్ మార్టం తర్వాత ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు.