జగన్ నోటి నుంచి వచ్చే మాటల్ని పవన్ క్షుణ్ణంగా వింటున్నారా?

రాజకీయ నాయకులు ఎవరైనా సరే.. ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని బెదిరించినా కూటమి సర్కారు ఊరుకోదని స్పష్టం చేశారు.;

Update: 2025-12-17 05:05 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా కేర్ ఫుల్ గా అబ్జర్వు చేస్తారా? ఆయన మాట్లాడే ప్రతి మాటను నిశితంగా విశ్లేషిస్తారా? అంటే అవునన్న విషయం అర్థమవుతుంది. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ చూస్తే.. మాజీ సీఎం నోటి నుంచి వచ్చే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా అబ్జర్వు చేస్తున్న వైనం అర్థమవుతుంది.

రాజకీయ నాయకులు ఎవరైనా సరే.. ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరిని బెదిరించినా కూటమి సర్కారు ఊరుకోదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఉపేక్షించమన్న ఆయన.. ‘‘చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అలాంటి వ్యక్తులు చేసే ప్రతి ప్రకటననూ నిశితంగా గమనిస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తులో మేం వస్తాం. శిక్షిస్తామని అంటున్నారంటే వారు ఏ స్థాయికి వెళ్లారో చూడాలి. విధి నిర్వహణలో అధికారులకు ఎలాంటి ఇబ్బందులైనా ఎదురైనా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

ఎప్పటిలానే తన నేపథ్యాన్ని.. తన తండ్రి పోలీసు ఉద్యోగాన్ని ప్రస్తావించారు. తన తండ్రి కానిస్టేబుల్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఆయన ప్రమోషన్ పొందిన ప్రతిసారీ తమ ఇంట్లో పండుగ వాతావరణం ఉండేదన్న విషయాన్ని గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని ఎవరు కించపరిచినా పై అధికారులు అండగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

పవన్ ప్రసంగాన్ని చూసినప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. మంత్రి నారా లోకేశ్ ను సైతం ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. ప్రభుత్వానికి అన్ని జిల్లాలు ఒక్కటేనన్న ఆయన.. ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ లేకపోతే సత్యసాయి జిల్లాకు పరిశ్రమలు తెచ్చారు? ఎంత అభిమానం లేకపోతే ప్రకాశం జిల్లాకు జేజేఎం ప్రాజెక్టు ఇచ్చారంటూ చంద్రబాబు తీరును ప్రశంసించారు. అదే సమయంలో మంత్రి లోకేశ్ ప్రస్తావన తీసుకురావటం కనిపిస్తుంది. పండుగ వాతావరణంలో నిర్వహించిన వేడుకలో లోకేశ్ లేకపోవటం పెద్ద లోటుగా పేర్కొన్నారు. ఇలా ప్రతి అంశంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటంతో పాటు..కూటమిలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలన్న తపన పవన్ లో కనిపిస్తుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News