ట్రంప్ వల్ల మీ సావు మీరు సావండి అమెరికన్లు.. చైనా సెటైరికల్ వీడియో వైరల్

కానీ ఇప్పుడు చైనాతో కటీఫ్ చేస్తే ఆ పనులన్నీ అమెరికన్లు చేయాలి. అదే వారికి బద్దకం.. దీన్నే చైనా సెటైరికల్ గా ఒక వీడియోను రూపొందించి వదిలింది అదే వైరల్ అవుతోంది..;

Update: 2025-04-09 16:22 GMT

నిజంగా ఇదీ బాధాకరమే.. మొండిఘటం ట్రంప్ టారీఫ్ లు ఇతర దేశాలపై తనకు ఇష్టమొచ్చినట్టు విధించేస్తాడు.. అసలు అడ్డు చెప్పేవారే లేరు.. చైనా లాంటి కమ్యూనిస్టు ఫాసిస్ట్ దేశం ఈ విషయంలో అసలే తగ్గదు. ఎందుకంటే అమెరికా ను మించి ఎదగాలని చూస్తున్న చైనాకు ఇదో అవకాశం. అమెరికాను దెబ్బకొట్టే సువర్ణావకాశం. అందుకే ట్రంప్ టెంపరితనంతో ఎంత శాతం టారిఫ్ లు వేస్తే అంతే టారిఫ్ లు వేస్తోంది చైనా.. దీని వల్ల చైనాకు పోయేదేం లేదు. అది యూరప్ సహా ప్రపంచమంతా తన ప్రోడక్టులు అమ్ముకుంటుంది.. పోయేది అమెరికాకే.. ఎందుకంటే టెక్నాలజీతో అన్నీ కనిపెట్టేసి.. వాటిని తయారు చేయకుండా.. తయారీ రంగాన్ని ఉంచుకోకుండా.. చీప్ గా చైనీయులతో అన్ని పనులు చేసుకుంది అమెరికా.. దాని వల్ల కోట్లలో వెనకేసుకుంది. కానీ ఇప్పుడు చైనాతో కటీఫ్ చేస్తే ఆ పనులన్నీ అమెరికన్లు చేయాలి. అదే వారికి బద్దకం.. దీన్నే చైనా సెటైరికల్ గా ఒక వీడియోను రూపొందించి వదిలింది అదే వైరల్ అవుతోంది..

డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలను ఎద్దేవా చేస్తూ చైనా రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ట్రంప్ బీజింగ్‌పై ఏకంగా 104 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో చైనా ఈ వ్యంగ్య వీడియోను రూపొందించింది.

టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఊబకాయంతో ఉన్న అమెరికన్లు దుస్తులు, ఇతర వస్తువులు తయారుచేసే పరిశ్రమల్లో పనిచేస్తూ అలసిపోయినట్లు చూపించారు. విషాదకరమైన సంగీతం నేపథ్యంలో సాగే ఈ వీడియో చివర్లో ట్రంప్ యొక్క ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించారు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా తన తయారీ రంగపు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించిందని, ఇప్పుడు దిగుమతులపై సుంకాలు పెంచడంతో ఆ పనులను అమెరికన్లే చేయాల్సి వస్తుందనే భావనను ఈ వీడియో తెలియజేస్తోంది.

ఈ వీడియోను షేర్ చేస్తూ ఒక నెటిజన్, "అమెరికా తిరిగి పారిశ్రామికీకరణ చెందడంపై చైనా ప్రజలు మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. లక్షల్లో వీక్షణలు పొందిన ఈ వీడియోపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్, అమెరికన్లు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని సందేహం వ్యక్తం చేయగా, మరొకరు అమెరికా ఈ పరిశ్రమను పూర్తిగా ఆటోమేట్ చేయగలదని అభిప్రాయపడ్డారు. "వారు స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు. ఇది మంచి ప్రారంభమే, కానీ దీనికి వాణిజ్య యుద్ధం అవసరం లేదు. ఉత్పత్తి తర్వాత తమ ఉత్పత్తులను కొనాలని అమెరికా ఇతరులను బలవంతం చేస్తుంది. ఇది ఊహించదగినదే" అని మరొకరు రాసుకొచ్చారు.

ట్రంప్ గతంలో పలుమార్లు ఇతర దేశాలు అధిక సుంకాలు విధిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను దోచుకుంటున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అన్ని దేశాల దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై 10 శాతం సుంకాలు విధించిన అమెరికా, వాటిని ఇటీవల 54 శాతానికి పెంచింది. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్, చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. అయితే చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ మరో 50 శాతం సుంకం విధించారు. దీంతో ప్రస్తుతం చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాల శాతం 104కు చేరుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో చైనా రూపొందించిన ఈ వ్యంగ్య వీడియో అమెరికాలోనూ చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News