అమెరికాపై 84 శాతం సుంకం.. షాకిచ్చిన చైనా
ట్రేడ్ వార్‌లో అమెరికా- చైనా మధ్య పోరు ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మొదలైన సుంకాల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.;
ట్రేడ్ వార్‌లో అమెరికా- చైనా మధ్య పోరు ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మొదలైన సుంకాల యుద్ధం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా అమెరికా ఉత్పత్తులపై ఏకంగా 84 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ప్రకటించడం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది.
ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 104 శాతం సుంకం విధించిన నేపథ్యంలో బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని ఆ ప్రకటనలో పేర్కొంది.
అమెరికా ఇటీవల చైనాపై ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా మొదట ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ట్రంప్, ఏప్రిల్ 8వ తేదీలోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానని అల్టిమేటం జారీ చేశారు.
అయితే చైనా ట్రంప్ హెచ్చరికను పట్టించుకోకపోవడంతో ఆయన తన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో విధించిన 54 శాతం సుంకానికి అదనంగా మరో 50 శాతం జోడించి, చైనాపై విధించిన మొత్తం సుంకాన్ని 104 శాతానికి పెంచారు.
దీనిపై చైనా తీవ్రంగా మండిపడింది. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతేకాకుండా ప్రతిగా తాము కూడా మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ తాజా పెంపుతో అమెరికా ఉత్పత్తులపై చైనా విధిస్తున్న మొత్తం సుంకం 84 శాతానికి చేరుకుంది.
ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.