అమెరికా అధ్యక్షుడిపై కోర్టుకెక్కిన రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడిపై కోర్టుకెక్కాయి ఆ దేశంలో రాష్ట్రాలు.ఇదో హాఠాత్ పరిణామం.సమాఖ్య స్ఫూర్తికి దర్పణంలా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉంటాయి.;
అమెరికా అధ్యక్షుడిపై కోర్టుకెక్కాయి ఆ దేశంలో రాష్ట్రాలు.ఇదో హాఠాత్ పరిణామం.సమాఖ్య స్ఫూర్తికి దర్పణంలా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉంటాయి.కానీ ఇప్పుడు ట్రంప్ కు వ్యతిరేకంగా రాష్ట్రాలు కోర్టుకు ఎక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై దేశంలోని 12 రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 1977 నాటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, అధ్యక్షుడికి లేని అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ టారిఫ్‌లు విధించారని ఆ రాష్ట్రాలు తమ దావాలో పేర్కొన్నాయి. టారిఫ్‌లను విధించే అధికారం కేవలం చట్టసభ (కాంగ్రెస్)కు మాత్రమే ఉందని, అత్యవసర పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (International Emergency Economic Powers Act - IEEPA) కల్పించదని పిటిషన్‌లో హైలైట్ చేశాయి.
ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేసిందని ఆరోపించాయి. అరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మైనే, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, మరియు వెర్మోంట్ రాష్ట్రాలు ఈ దావాను దాఖలు చేశాయి. ఈ రాష్ట్రాలు ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు, వ్యాపారాలు, మరియు వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారని వాదిస్తున్నాయి.
అధ్యక్షుడు తన "ఇష్టానుసారం" , "అస్తవ్యస్తంగా" టారిఫ్‌లు విధించడం ద్వారా రాజ్యాంగబద్ధమైన అధికార విభజనను ఉల్లంఘించారని, ఇది దేశ వాణిజ్య విధానాన్ని అనిశ్చితిలోకి నెట్టివేసిందని రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఈ టారిఫ్‌లు అంతిమంగా అమెరికా వినియోగదారులపై పన్నుల భారాన్ని మోపుతాయని, ధరల పెరుగుదలకు దారితీస్తాయని అవి ఆందోళన వ్యక్తం చేశాయి.
కాగా, ట్రంప్ తన టారిఫ్ విధానం అమెరికా పరిశ్రమలను రక్షించడానికి.. దేశంలో తయారీ రంగ ఉద్యోగాలను తిరిగి తీసుకురావడానికి ఉద్దేశించిందని వాదించారు. అయితే, దావా వేసిన రాష్ట్రాలు ట్రంప్ చర్యలు చట్టవిరుద్ధమని.. దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరమని పేర్కొంటూ, టారిఫ్‌లను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించాయి. కాలిఫోర్నియా రాష్ట్రం కూడా గతంలో ట్రంప్ టారిఫ్‌లపై విడిగా దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ 12 రాష్ట్రాల తాజా దావా ట్రంప్ వాణిజ్య విధానాలపై పెరుగుతున్న వ్యతిరేకతను, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో దాని ప్రభావంపై ఆందోళనలను ప్రతిబింబిస్తోంది.