మంచు హీరోకి జోడీగా ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారు..?

Update: 2020-11-24 10:50 GMT
డైరెక్టర్ శ్రీను వైట్ల - మంచు విష్ణు కాంబినేషన్ లో 2007లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ 'ఢీ' మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ మంచు విష్ణు తన పుట్టినరోజు సందర్భంగా 'డి & డి' చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ పోస్టర్ కూడా విడుదల చేసారు. ‘డబుల్‌ డోస్‌’ అనేది దీనికి ఉపశీర్షిక. పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఢీ’తో పోలిస్తే... డబుల్‌ కామెడీ మరియు యాక్షన్‌ ఈ చిత్రంలో ఉంటాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అవరమ్‌ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీను వైట్ల ఇప్పటికే ఈ చిత్రంలో విష్ణుకి జోడీని వెత‌క‌డం స్టార్ట్ చేశాడని తెలుస్తోంది.

'ఢీ' చిత్రంలో విష్ణు సరసన హీరోయిన్ జెనీలియా నటించింది. ఇప్పుడు 'డి & డి' చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ లేదా ప్ర‌గ్యా జైస్వాల్ ని తీసుకునే అవ‌కాశం ఉందని కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తోంది. అలానే శర్వానంద్ - సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'మహా సముద్రం' లో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మరోవైపు ప్రగ్యా జైస్వాల్ బాలయ్య - బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు విష్ణు కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి రచయితలు గోపీమోహన్‌ - కిశోర్‌ గోపు పని చేస్తున్నారు. మోహనకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.
Tags:    

Similar News