మెగా మేనల్లుడు.. సడెన్ గా 'ప్రొడక్షన్' ట్విస్ట్ ఏంటి?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌ గా మారుతోంది.;

Update: 2026-04-23 11:30 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌ గా మారుతోంది. విరూపాక్ష వంటి బ్లాక్‌ బస్టర్ విజయంతో ఫుల్ జోష్‌ లోకి వచ్చిన తేజ్, ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బైక్ ప్రమాదం అనంతరం పూర్తిగా కోలుకోవడానికి, ఫిట్‌ గా మారేందుకు ఆయన తీసుకున్న విరామం ఇప్పుడు ముగిసింది. ఇక మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద వరుసగా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం తేజ్ తన కెరీర్‌ లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటి గట్టు చిత్ర షూటిం గ్‌లో బిజీగా ఉన్నారు. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఆ సినిమాపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కథ ఎంపిక నుంచి క్యారెక్టరైజేషన్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు ప్రతి అంశంలోనూ తేజ్ కష్టపడుతున్నారని తెలుస్తోంది.

ఇక ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తదుపరి సినిమాలు ప్రారంభించాలని తేజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అభిమానులకు కిక్ ఇచ్చే విషయమేమిటంటే.. ఆయన చేతిలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు సుజీత్‌ తో పాటు సందీప్‌ తో కూడా కొత్త సినిమాలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని వినికిడి.

సంబరాల ఏటి గట్టు విడుదలైన వెంటనే ఆ కొత్త ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో తేజ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకేసారి పలు సినిమాలను లైన్‌లో పెట్టి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌ లతో అభిమానులను అలరించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు తేజ్ కెరీర్‌ లో మరో కొత్త మలుపు తిరగబోతోందన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించేందుకు తేజ్ రెడీ అవుతున్నారట. త్వరలోనే ఆ నిర్మాణ సంస్థపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఆ బ్యానర్‌లో మొదటి సినిమా ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజ్ స్వయంగా హీరోగా నటిస్తారా? లేక కొత్త టాలెంట్‌ ను ప్రోత్సహించేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు నిర్మాతలుగా విజయాలు అందుకున్న నేపథ్యంలో తేజ్ కూడా అదే బాటలో నడవాలని చూస్తున్నారని చర్చ జరుగుతోంది. మొత్తానికి తేజ్.. ఒకవైపు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ ఈ రెండు ప్లాన్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News