ఓదెల 'ప్యారడైజ్'.. ఆ ముగ్గురితో నాని ఇప్పట్లో వర్క్ చేయలేరా?
అయితే ఆ ప్రాజెక్ట్ కారణంగా నాని ఇతర సినిమాలు ఆలస్యమవుతున్నాయనే ఆందోళన ఇప్పుడు ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది.;
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్’ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు దాదాపు 95 రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇంకా సుమారు 40 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే టాకీ పార్ట్ పూర్తవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన స్టైల్ కు తగ్గట్లుగా రా అండ్ రస్టిక్ విజువల్స్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సీన్ ను క్వాలిటీతో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నాని కొత్త లుక్ లో కనిపించనున్నారని టాక్. ఆయన పాత్ర గతంలో ఎప్పుడూ చూడని విధంగా డిజైన్ చేసినట్లు సమాచారం. దసరాలో ధరణి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని, ఈసారి మరింత పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ది ప్యారడైజ్ ను 2026 ఆగస్టులో థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
అయితే ఆ ప్రాజెక్ట్ కారణంగా నాని ఇతర సినిమాలు ఆలస్యమవుతున్నాయనే ఆందోళన ఇప్పుడు ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది. ది ప్యారడైజ్ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో, ఆయన చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులు అనిశ్చితిలో పడ్డాయి. దర్శకులు శౌర్యువ్, సీబీ చక్రవర్తి, టి.జె. జ్ఞానవేల్ తో చేయాల్సిన సినిమాలు ప్రస్తుతం ఆగినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎందుకంటే ప్యారడైజ్ తర్వాత నాని, దర్శకుడు సుజీత్ తో బ్లడీ రోమియో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం సుజీత్ వేచి ఉన్నారని తెలుస్తోంది. కానీ ప్యారడైజ్ పూర్తి కావడం, తర్వాత బ్లడీ రోమియో షూటింగ్ మొదలై పూర్తవడం వరకు ఇంకా సమయం పట్టే అవకాశముంది. దీంతో శౌర్యువ్, సీబీ చక్రవర్తి, టి.జె. జ్ఞానవేల్ తమ తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఫలితంగా నానితో వీరి కాంబినేషన్ లో సినిమాలు మళ్లీ ఉంటాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నానితో ఇప్పట్లో చేయలేరని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి ది ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో, అదే స్థాయిలో ఆ సినిమా నాని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ప్లాన్ చేసిన సమయానికి సినిమా పూర్తి చేసి విడుదల చేస్తే, ఇది ఆయన కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అభిమానులు కూడా ఆ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఆశిస్తున్నారు.