పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!
| చిల్డ్రన్స్ డే సందర్భంగా కోలీవుడ్ ప్రముఖులు తమ పిల్లల విజయాలను గుర్తు చేసుకున్నారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తనయుడి ప్రగతిపై భావోద్వేగానికి గురయ్యారు. అజిత్ కుమార్ కుమారుడి ఫుట్‌బాల్ జట్టు ఛాంపియన్షిప్ గెలవగా, సూర్య–జ్యోతిక కుమార్తె దియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పిల్లల కలలకు తల్లిదండ్రులు అండగా నిలవాలని జ్యోతిక సూచించారు.
తమిళ పరిశ్రమలో ఎంతటి సూపర్స్టార్లయినా? వెండితెరపై ఎలాంటి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నా? నిజ జీవితంలో మాత్రం వారంతా సాధారణ తల్లిదండ్రులే. పిల్లలు సాధించే ప్రతి విజయానికి వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా నేడు చిల్డ్రన్స్ డే సందర్భంగా కోలీవుడ్ ప్రముఖులు తమ పిల్లల ప్రగతిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మధురమైన జ్ఞాపకాలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెరపై కనిపించే హీరోలకే కాదు. వారి ఇళ్లలోని చిన్నారుల విజయాలు కూడా తల్లిదండ్రులుగా వారికి ఎంతో గర్వకారణంగా మారుతున్నాయి.
సెలబ్రిటీ పేరెంటింగ్ జాబితాలో స్టార్ హీరో విజయ్ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక సందర్భం అభిమానులను ఆకట్టుకుంది. విజయ్ తండ్రి- దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ తనయుడు సాధించిన విజయాలు చూసి తండ్రిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తెరపై యాక్షన్ సీన్లతో అలరించే హీరోలు నిజ జీవితంలో తమ కుటుం బ సభ్యుల ఎదుగుదలను చూసి ఎంత మురిసిపోతారో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. మరో స్టార్ హీరో అజిత్ కుమార్ - షాలిని దంపతుల కుమారుడు స్పోర్ట్స్ రంగంలో సాధించిన విజయం కుటుంబంలో పండుగ వాతావరణాన్ని నింపింది.
కుమారుడి ఫుట్‌బాల్ టీమ్ యూత్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న సందర్భంగా షాలిని ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చదువు మాత్రమే కాకుండా క్రీడల్లోనూ పిల్లలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను గెలుచుకున్న పతకాలతో వచ్చే సంతోషాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేశారు. కోలీవుడ్ లవబుల్ కపుల్స్ సూర్య - జ్యోతిక దంపతులు కూడా కుమార్తె దియా గ్రాడ్యుయేషన్ వేడుకను కుటుంబంతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా జ్యోతిక స్పందించారు. పిల్లలు తాము ఎంచుకునే మార్గాల్లో భయంతో కాకుండా సొంత ఇష్టాలు .. కలల ఆధారంగా ముందుకు సాగేలా తల్లిదండ్రులు ఎప్పుడూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మాటలు నేటి తరం పేరెంటింగ్‌కు చక్కటి స్పూర్తిని అందిస్తున్నాయి. సెలబ్రిటీల షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా? పిల్లల చదువులు, క్రీడలు , విజయాల వేళ స్టార్స్ ఇలా రియల్ లైఫ్ రోల్స్‌లో ఒదిగిపోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీల గ్లామర్ ప్రపంచానికి అతీతంగా వారిలో సాధారణ తల్లిదండ్రుల ప్రేమను.. బాధ్యతను చాటే జ్ఞాపకాలు చిల్డ్రన్స్ డే వేళ ఓ మధురమైన అనుభూతిని అందిస్తున్నాయి.