బన్నీ రేసులో బోయపాటి నెంబర్ - 4!
| అల్లు అర్జున్ తదుపరి సినిమాల జాబితాలో బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్న బన్నీ, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్ సినిమాలు చేయనున్నట్లు సమాచారం. ఈ మూడు ప్రాజెక్టుల తర్వాతే బోయపాటి సినిమా పట్టాలెక్కే అవకాశముందని, దీనికి రెండున్నరేళ్లకు పైగా సమయం పట్టవచ్చని టాక్.
`పుష్ప` విజయంతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాల విషయం లో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల జాబితా చూస్తే? అసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది. అందులో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్థానం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది. అల్లు అర్జున్ తదుపరి సినిమాల రేసులో బోయపాటి ప్రాజెక్ట్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `రాకా` పైనే పెట్టారు.
సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరు గుతోంది. ఈ భారీ విజువల్ వండర్ పూర్తయిన వెంటనే మరో కోలీవుడ్ సంచలన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో బన్నీ జత కట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కొలిక్కి రావడంతో `రాకా` తర్వాత సెట్స్ పైకి వెళ్లే రెండో సినిమా ఇదేనని దాదాపు ఖరారైనట్లే. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత బన్నీ మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 25వ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నారు.
మిన్నల్ మురళి వంటి చిత్రంతో తనదైన ముద్ర వేసిన బాసిల్ చెప్పిన కొత్త తరహా కథ బన్నీని ఆకట్టుకుంది. దీంతో బన్నీ లైనప్‌లో మూడో స్థానంలో బాసిల్ జోసెఫ్ సినిమాను లాక్ చేసినట్లు సమాచారం. ఈ మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల తర్వాతే బోయపాటి శ్రీను సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఇద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `సరైనోడు` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.
ఈ నేపథ్యంలో బన్నీ కోసం బోయపాటి పవర్‌ఫుల్ మైథలాజికల్ టచ్ ఉన్న కథను సిద్ధం చేస్తున్నారని.. అది బన్నీకి బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.అయితే ఏ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. లోకేష్ ప్రాజెక్ట్ మాత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా లోకేష్ వేగంగానే పూర్తి చేస్తారు. ఈ విషయంలో లోకేష్ పెద్దగా సమయం తీసుకోరు. చిత్రీకరణ ముగించే విషయంలో లోకేష్ `లియో` స్ట్రాటజీ అనుసరిస్తారని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. ఎలా చూసుకున్నా? బోయపాటి ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే? ఎలా లేదన్నా రెండున్నరేళ్లకు పైగా సమయం పడుతుంది.