'ఓం' మూవీ రివ్యూ
| ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ‘ఓం’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ కథతో ఆసక్తికరంగా మొదలైన సినిమా, ఇంటర్వెల్ వరకు మంచి ఉత్కంఠను కొనసాగిస్తుంది. అయితే రెండో భాగంలో కథనం దారి తప్పి, సాగతీత సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి నటన బాగున్నా, పాత్రలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. సాయి అభ్యంకర్ సంగీతం, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు సినిమాకు బలంగా నిలిచాయి. బలమైన కథాంశాన్ని సమర్థవంతంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
‘ఓం’ మూవీ రివ్యూ
నటీనటులు: ధనుష్- మమ్ముట్టి- సాయిపల్లవి- శ్రీలీల- నసీరుద్దీన్ షా- రేణు దేశాాయ్- ఇంద్రన్స్-సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: సాయి అభ్యంకర్
ఛాయాగ్రహణం: ఎళిల్ అరసు
నిర్మాతలు: శ్రద్ధ అగర్వాల్- అజ్మత్ జగ్మగ్-ధనుష్
రచన-దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియస్వామి
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విలక్షణ నటుడు ధనుష్.. మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టిల క్రేజీ కాంబినేషన్లో ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందించిన చిత్రం.. ఓం. సాయిపల్లవి ఓ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఈ రోజే మంచి అంచనాల మధ్య తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ: తమిళనాడుకు చెందిన పళనిస్వామి (ధనుష్) పైకి ఒక ఫొటోగ్రాఫర్ లాగా నటిస్తూ.. పోలీసుల కోసం పని చేసే ఒక ఇన్ఫార్మర్. ఏపీలోని శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనాన్ని దేశం దాటించి విదేశాలకు స్మగ్లింగ్ చేసే మాఫియా కీలక పాత్ర పోషిస్తున్న తమిళనాడుకు చెందిన డాన్ కార్తికేయన్ అలియాస్ సియాన్ (మమ్ముట్టి) దగ్గర తిరుకుమరన్ పేరుతో పర్సనల్ ఫొటోగ్రాఫర్ గా చేరిన పళని.. ఏపీకి చెందిన పోలీస్ అధికారిణి నిత్యారెడ్డి (సాయిపల్లవి) కింద పని చేస్తుంటాడు. ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఉక్కుపాదం మోపడంతో సియాన్ కు చెందిన వెయ్యి టన్నుల ఎర్రచందనం స్ట్రక్ అయిపోగా.. ఈ సరకును దేశం దాటించే బాధ్యతను పళని తీసుకుంటాడు. ఈ క్రమంలో మొత్తం స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు చేయాలన్నది పోలీసుల ప్రణాళిక. మరి ఈ ప్లాన్ ఎంతమేరకు ఫలించింది.. పళని విజయవంతంగా మిషన్ పూర్తి చేయగలిగాడా.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి.. తన కుటుంబం సంగతేంటి.. పళని గురించి సియాన్ కు తెలిసిందా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: ఎర్రచందనం మీద సినిమా అనగానే తెలుగు వాళ్లకే కాదు.. దేశం మొత్తానికి గుర్తొచ్చేది ‘పుష్ప’నే. ఒక ఎర్రచందనం కూలీ.. ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదిగే క్రమాన్ని రోమాంచితంగా చూపించి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించాడు సుకుమార్. ఐతే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మళ్లీ సినిమా అంటే ఎందుకు అనే ప్రశ్నే తలెత్తుతుంది. కానీ ధనుష్.. మమ్ముట్టి.. సాయిపల్లవి.. నసీరుద్దీన్ షా లాంటి అదిరిపోయే కాస్టింగ్ పెట్టుకుని.. ‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడంటే.. ఈ కథలో ఏదో కొత్త కోణం చూపిస్తాడనే ఆశిస్తాం. ‘అమరన్’లో వీరమరణం పొందిన ఒక సైనికుడి రియల్ స్టోరీని హృద్యంగా తీసి మెప్పించిన రాజ్ కుమార్.. ‘పుష్ప’ తరహాలో కాకుండా ఎర్రచందనం కథను తన స్టయిల్లో రియలిస్టిగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. 2015లో ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సంచలనం రేపి.. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసిన ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ ఘటన చుట్టూ అల్లిన ఈ కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి కానీ.. ఇటు పోలీసులు- అటు కూలీలు ఈ రెండు కోణాల నుంచి కథను చెప్పే ప్రయత్నంలో సమతూకం సరిగా కుదరకపోవడం.. కథలో పెద్దగా సర్ప్రైజులేమీ లేకుండా ఫ్లాట్ గా సాగిపోవడంతో ‘ఓం’ ఒక స్థాయికి మించి ఎంగేజ్ చేయలేకపోయింది. ధనుష్.. మమ్ముట్టి.. సాయిపల్లవి.. ఈ ముగ్గురి పెర్ఫామెన్సులు బాగున్నా.. ఈ పాత్రలేవీ అనుకున్నంత బాగా పండకపోవడంతో ‘ఓం’ అంచనాలకు దూరంలో ఆగిపోయింది.
‘ఓం’ కథను ఎంతో ఆసక్తికరంగా మొదలుపెట్టి.. ఒక దశ వరకు బాగానే నడిపించాడు రాజ్ కుమార్ పెరియస్వామి. పోలీస్ ఇన్ఫార్మర్ అయిన హీరో.. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా నాయకుడిని మెప్పించి తన గ్యాంగులో చేరడంతో మొదలుపెట్టి.. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఒక పెద్ద ఆపరేషన్లో భాగం అయ్యేవరకు కథ ఆసక్తికరంగా నడుస్తుంది. ఇదంతా ఎప్పుడూ చూడనిది కాదు.. సన్నివేశాలు మరీ కొత్తగా ఏమీ అనిపించవు. కానీ కథ ఇంటెన్స్ గా.. ఇంట్రెస్టింగ్ గా సాగుతూ.. ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ధనుష్.. మమ్ముట్టి.. సాయిపల్లవిల స్క్రీన్ ప్రెజెన్స్-పెర్ఫామెన్స్ వల్ల కూడా ఆడియన్స్ అటెన్షన్ రాబడుతుంది. ఇంటర్వెల్ సమయానికి కథ రసకందాయంలో పడేలా ఎమోషనల్ బ్యాంగ్ ఇచ్చాడు దర్శకుడు. పోలీసుల కోసం పని చేసే హీరో.. పోలీసుల వల్ల బాధితుడిగా మారడం అన్నది బలమైన కాన్ఫ్లిక్ట్ కు దారి తీసే మలుపు. ఇక్కడి నుంచి కథ ఎలా ముందుకు సాగుతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది.
ఇంటర్వెల్ తర్వాత ఏదో ఆశిస్తే.. ఇంకేదో జరుగుతుంది. అప్పటిదాకా పోలీసుల కోణంలో సాగుతున్న కథ కాస్తా.. ఉన్నట్లుండి కూలీల వైపు షిఫ్ట్ అవుతుంది. కూలీల తాలూకు కష్టాలు.. కన్నీళ్ల చుట్టూ ఎమోషనల్ గా కథను నడిపించాలని చేసిన ప్రయత్నం దారి తప్పింది. ఈ కోణంలో కథను చెప్పాలనుకుంటే.. ముందు నుంచే ఒక పునాది వేయాల్సింది. కానీ సగం సినిమా వరకు ఆ పాయింటునే టచ్ చేయకుండా.. ఒక్కసారిగా కూలీలకు సంబంధించిన మానవతా కోణాన్ని చూపిస్తూ వన్ సైడెడ్ గా చూపిస్తూ విపరీతమైన సాగతీతతో సన్నివేశాలను నడిపించడంతో ‘ఓం’ సినిమా ఎటో వెళ్లిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ వరకు ఒక కథను చూసి.. సెకండాఫ్ అంతా ఇంకో కథను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పోనీ హీరో ఏమైనా ఆ సైడ్ తీసుకుని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా చూపించినా కొంత ఆసక్తికరంగా ఉండేదేమో. కానీ హీరో మళ్లీ పాత పనే చేస్తుంటాడు. సెకండాఫ్ మొత్తంలో అడవి నేపథ్యంలో వచ్చే ఒక ఫైట్ మినహాయిస్తే.. చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు. జైలు నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమాకు ముగింపు పలికారు కానీ.. అది కూడా అంతగా పేలలేదు. మొత్తంగా చెప్పాలంటే ‘ఓం’ ప్రామిసింగ్ గా మొదలై.. మధ్యలో ఆసక్తికర మలుపు తిరిగి.. ఆ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పి.. చివరికి నిరాశాజనకంగా ముగుస్తుంది. పెర్ఫామెన్సుల కోసం.. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కోసం ఒక లుక్కేయొచ్చు కానీ.. అంచనాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
నటీనటులు: పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రలో ధనుష్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్లో తన పెర్ఫామెన్స్ స్టాండౌట్ గా నిలుస్తుంది. సినిమాలో ఎక్కడా వంక పెట్టలేని విధంగా అతను నటించాడు. కానీ ద్వితీయార్ధంలో తన పాత్ర దశా దిశా లేనట్లు సాగడంతో కనెక్ట్ కావడం కష్టమవుతుంది. మమ్ముట్టిది కథలో కీలక పాత్రే కానీ.. చాలా వరకు ప్యాసివ్ గా సాగడంతో ఆయన ప్రత్యేకతను చూపించడానికి అవకాశం తక్కువగానే లభించింది. అయినప్పటికీ మమ్ముట్టి సటిల్ యాక్టింగ్ తో సియాన్ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సాయిపల్లవి ఇప్పటిదాకా చేయని ఫెరోషియస్ పోలీసాఫీసర్ పాత్రలో అదరగొట్టింది. యాక్షన్ ఘట్టాల్లో చాలా కన్విన్సింగ్ గా పెర్ఫామ్ చేసింది సాయిపల్లవి. కానీ తన పాత్ర నుంచి కూడా ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ధనుష్ కు జోడీగా మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో సాయిపల్లవి భిన్నంగా కనిపించింది. అంత ప్రాధాన్యమున్న పాత్ర కాదు కానీ.. శ్రీలీల మేకప్ లేకుండా సింపుల్ గా కనిపించే పాత్రలో కన్విన్సింగ్ గా నటించింది. మమ్ముట్టి భార్య పాత్రలో రేణు దేశాయ్ ఓకే. నసీరుద్దీన్ షా లాంటి గొప్ప నటుడు చేశాడంటే ఆ పాత్ర నుంచి ఎంతో ఆశిస్తాం. కానీ ఆయన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయనతో ఎందుకు చేయించారో.. ఆయనెందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు. ఇంద్రన్స్.. సంజయ్ స్వరూప్.. శివాజీ రాజా.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘ఓం’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సాయి అభ్యంకర్ తన మీద ఉన్న అంచనాలకు తగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. వీరా వీరా పాట మంచి హై ఇస్తుంది. మిగతా పాటలు కూడా ఓకే. బీజీఎం సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అడవిలో యాక్షన్ ఎపిసోడ్ టైంలో సాయి అభ్యంకర్ చెలరేగిపోయాడు. క్లైమాక్సులో కూడా స్కోర్ ఎనర్జీ ఇస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఏమీ లోటు లేదు. సినిమాను భారీగా తీశారు. రాజ్ కుమార్ పెరియస్వామి ఎంచుకున్న కథ ఆసక్తికరమే కానీ.. ‘అమరన్’లో మాదిరి భావోద్వేగాలను సరిగా పండించలేకపోయాడు. స్క్రీన్ ప్లే ఎగుడుదిగుడుగా సాగుతూ.. ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేయించలేకపోయింది. ప్రథమార్ధాన్ని మంచి టెంపోలో నడిపించిన రాజ్ కుమార్.. తర్వాత మాత్రం ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. కొన్ని చోట్ల తన మార్కు చూపించినప్పటికీ.. ఓవరాల్ గా రాజ్ కుమార్ నిరాశపరిచాడు.
చివరగా: ఓ.ఎం: ఆపరేషన్ మిస్ ఫైర్
రేటింగ్-2.25/5