కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?
| నవంబర్ మూడో వారంలో మూడు ఆసక్తికర సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి. తెలుగులో తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, తమిళంలో ధనుష్, మమ్ముట్టి నటించిన ‘ఓం’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. మంచి బజ్, అంచనాలతో వస్తున్న ఈ మూడు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
నవంబరు అంటే బాక్సాఫీస్‌కు అన్ సీజన్ అనే ఒక ముద్ర పడిపోయింది. ఈ నెలలో పేరున్న సినిమాలు రిలీజ్ కావు. విడుదలయ్యే సినిమాలకు కూడా ఆశించిన ఫలితాలు ఉండవనడానికి చాలా రుజువులున్నాయి. కానీ ఈ నవంబరులో మాత్రం క్రేజున్న సినిమాలు చాలానే రిలీజవుతున్నాయి. ముఖ్యంగా మూడో వారంలో రసవత్తరమైన బాక్సాఫీస్ పోరును చూడబోతున్నాం. కంటెంట్ బలంగా ఉన్న మూడు క్రేజీ సినిమాలు ఆ వీకెండ్లో పోటీకి సై అంటున్నాయి.
తెలుగు నుంచి ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో పాటు దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. వీటితో పాటు తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘ఓం’ వస్తోంది. ‘ఓం’లో మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ మలయాళ నటులు కాగా.. వీరిలో ఒకరు నటించిన తమిళ చిత్రంలో, ఇంకొకరు నటించిన తెలుగు సినిమా మధ్య రసవత్తర పోరు చూడబోతున్నాం.
‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనపుడు ఒక మోస్తరు ఫలితాన్నే దక్కించుకుంది కానీ.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు దీనికి సీక్వెల్ తీశాడు తరుణ్ భాస్కర్. ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లిన రోజు నుంచి మంచి హైప్ ఉంది. దీని ట్రైలర్ ఒక మోస్తరుగా అనిపించినప్పటికీ, ‘ఈ నగరానికి ఏమైంది’ ఫ్లేవర్ మిస్సయిందనే ఫీలింగ్ కలిగినప్పటికీ.. రిలీజ్ టైంకి యూత్ థియేటర్లకు పరుగులు పెడతారనే అంచనాలున్నాయి. ఇక ‘ఆకాశంలో ఒక తార’కు సంబంధించి ప్రతి ప్రోమో గొప్పగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ బజ్ తెచ్చుకున్న సినిమా అరుదు. ఇది కచ్చితంగా కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో సినిమాపై అంత మంచి బజ్ ఉంది.
మరోవైపు ‘అమరన్’ తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేసిన సినిమా కావడం.. ప్రోమోలు ఇంట్రెస్టింగ్‌గా ఉండడం, కథాంశం మీద వివాదాలు తలెత్తేలా ఉండడం.. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీలల కాంబినేషన్.. అన్నీ కూడా ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా మీద పడేలా చేశాయి. కచ్చితంగా పెద్ద హిట్టయ్యే సినిమా అవుతుందని ‘ఓం’ మీద అంచనాలున్నాయి. మొత్తంగా వచ్చే వీకెండ్లో వచ్చే మూడు సినిమాలు చాలా బలమైన కంటెంట్, మంచి అంచనాలతోనే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ మూడూ విజయవంతం అవుతాయా.. మూడింట్లో పైచేయి సాధించే సినిమా ఏది అన్నది ఆసక్తికరం.