వెంకీ త్రివిక్రమ్.. మళ్ళీ ఈ చేంజ్ ఏంటి?

సినిమా షూటింగ్ మొదలైన తర్వాత సాంకేతిక నిపుణులు మారడం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరిగే విషయమే.;

Update: 2026-04-23 09:43 GMT

సినిమా షూటింగ్ మొదలైన తర్వాత సాంకేతిక నిపుణులు మారడం ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరిగే విషయమే. అయితే అది వెంకటేష్, త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్లో జరిగితే మాత్రం చర్చ మరో రేంజ్ లో ఉంటుంది. ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి దీనికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే విషయంలో ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలోకి మళ్ళీ త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ వచ్చి చేరారని సమాచారం. ఇప్పటికే తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని ఇండస్ట్రీ టాక్. నిజానికి హర్షవర్ధన్ రమేశ్వర్ చాలా టాలెంటెడ్. సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యానిమల్’ సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్.

అలాంటి పవర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చే టెక్నీషియన్ ను త్రివిక్రమ్ ఎందుకు వదులుకున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. నిజానికి సినిమా ప్రారంభంలోనే హర్షవర్ధన్ రమేశ్వర్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయని సమాచారం. కానీ అధికారికంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఎక్కడా ఆయన పేరు మెన్షన్ చేయకపోవడం అప్పట్లోనే అనుమానాలకు తావిచ్చింది. బహుశా త్రివిక్రమ్ మార్క్ మేకింగ్‌కు హర్షవర్ధన్ స్టైల్ ఎంతవరకు సింక్ అవుతుందో లేదో అని మేకర్స్ ముందే ఒక సందేహంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ట్యూన్స్ విషయంలో ఇద్దరి మధ్య సరైన కనెక్టివిటీ కుదరకపోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణమై ఉండవచ్చు. త్రివిక్రమ్ గత కొన్ని వరుస సినిమాలకు తమన్ తోనే పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడమే కాకుండా, థియేటర్లలో సౌండింగ్ పరంగా కూడా కొత్త అనుభూతిని ఇచ్చాయి. బహుశా ‘ఆదర్శ కుటుంబం’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో, అలాంటి సినిమాలకు కావాల్సిన మెలోడీలు ఇవ్వడంలో తమన్ పై ఉన్న నమ్మకమే ఈ నిర్ణయానికి కారణం కావచ్చు.

హర్షవర్ధన్ మాస్ ఇంటెన్స్ మ్యూజిక్ కు సెట్ అవుతారు కానీ, వింటేజ్ వెంకీ మామ స్టైల్ ఫ్యామిలీ డ్రామాకు తమన్ బాణీలే కరెక్ట్ అని మేకర్స్ భావించి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న లీకుల ప్రకారం చూస్తే ఇది దాదాపు ఖాయమైనట్లే అనిపిస్తోంది. షూటింగ్ వేగంగా జరుగుతున్న ఈ తరుణంలో సంగీత దర్శకుడు మారడం అనేది సినిమా షెడ్యూల్స్ పై ఏమైనా ప్రభావం చూపుతుందో లేదో చూడాలి. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News