AI ఒప్పందాలతో గ్లామర్ రంగంలో వీళ్లకు పెను ముప్పు!
ఆధునిక సినీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కలయిక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
ఆధునిక సినీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కలయిక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా డీ-ఏజింగ్, `డిజిటల్ అవతార్` సాంకేతికతలు నటీనటులకు వెండితెరపై నిత్య యవ్వనాన్ని అందిస్తున్నాయి. కేవలం మేకప్, కాస్ట్యూమ్స్‌కే పరిమితం కాకుండా కంప్యూటర్ సైన్స్, ఏఐ మెషిన్ లెర్నింగ్ ఆధారంగా దశాబ్దాల క్రితం నాటి నటుల యవ్వన రూపాన్ని తిరిగి తీసుకురావడం లేదా చనిపోయిన నటులను డిజిటల్ రూపంలో పునఃసృష్టించడం నేడు సాధ్యమవుతోంది. హాలీవుడ్లో రాబర్ట్ డి నీరో, హారిసన్ ఫోర్డ్ లతో పాటు భారతీయ సినిమాల్లో విజయకాంత్, కమల్ హాసన్ వంటి నటుల కోసం ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించారు.
డీ-ఏజింగ్ ప్రక్రియలో 3డి ఫేషియల్ స్కానింగ్, ఏఐ డీప్ లెర్నింగ్, ఫేషియల్ మోషన్ ట్రాకింగ్..`ఆత్మన్` వంటి అధునాతన సాధనాలను ఉపయోగిస్తున్నారు. హై-రెజల్యూషన్ కెమెరాల సహాయంతో నటుడి ముఖ నిర్మాణం, చర్మపు ముడతలను స్కాన్ చేసి 3డి మోడల్‌గా మార్చడం...ఏఐ వాయిస్ క్లోనింగ్ ద్వారా స్వరాన్ని తిరిగి పొందడం వంటి సాంకేతికతలు దర్శకులకు ఆపరిమిత సృజనాత్మక స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ విప్లవాత్మక పురోగతి వెనుక సినీ పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది మంది చిన్న చిన్న కళాకారులు, సాంకేతిక నిపుణుల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.
ఈ ఏఐ సాంకేతికతల వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయేది యంగ్ యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులే. ఒకప్పుడు సీనియర్ హీరోల చిన్ననాటి లేదా యవ్వనంలో ఉండే పాత్రల కోసం కొత్తగా వచ్చే యంగ్ యాక్టర్లను ఎంపిక చేసేవారు. కానీ ఇప్పుడు డీ-ఏజింగ్ ద్వారా స్టార్ హీరోలనే యంగ్‌గా చూపిస్తుండటంతో కొత్త నటులకు అవకాశాలు తగ్గుతున్నాయి. అలాగే భారీ సన్నివేశాలలో డిజిటల్ క్రౌడ్ సాంకేతికతతో వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులను ఏఐ ద్వారా సృష్టించగలుగుతుండటంతో... రోజూవారీ వేతనంపై ఆధారపడే వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు తమ జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి దాపురించింది.
స్టంట్ మేన్లు, డబ్బింగ్ కళాకారులు, లైట్ మేన్ల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ప్రమాదకరమైన సాహస సన్నివేశాల్లో నిజమైన స్టంట్ మేన్లకు బదులుగా డిజిటల్ అవతార్లు.. సీజీఐ టెక్నాలజీని ఉపయోగిస్తుండటంతో ఫైట్ మాస్టర్లు, స్టంట్ ఆర్టిస్టుల ప్రాధాన్యత తగ్గుతోంది. మరోవైపు ఏఐ వాయిస్ క్లోనింగ్ సహాయంతో నటుల గొంతులను రీ-క్రియేట్ చేస్తుండటంతో డబ్బింగ్ ఆర్టిస్టుల ఉపాధి గండిపడుతోంది. ఇక సెట్స్‌పై రోజువారీ లైటింగ్ లైట్లను అమర్చే లైట్ మేన్లకు సైతం, ఏఐ వర్చువల్ ప్రొడక్షన్ - డిజిటల్ లైటింగ్ వాతావరణం వల్ల భవిష్యత్తులో పనిదినాలు తగ్గడమే కాకుండా ఉపాధి ముప్పు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాంకేతిక సవాళ్లకు తోడు నైతిక, చట్టపరమైన సమస్యలు పరిశ్రమను గందరగోళానికి గురిచేస్తున్నాయి. చనిపోయిన కళాకారుల అనుమతి లేకుండా వారి డిజిటల్ అవతార్లను వాడటం పెను వివాదాలకు దారితీస్తోంది. ప్రొడక్షన్ కంపెనీలు ఒప్పందాల పేరుతో నటుల డిజిటల్ స్కాన్లను, వాయిస్ హక్కులను శాశ్వతంగా పొందేందుకు ప్రయత్నించడం వారి స్వయంప్రతిపత్తిని కాలరాస్తోంది. భారత్ వంటి దేశాల్లో ఒక వ్యక్తి రూపం, స్వరాలను నియంత్రించే `రైట్ ఆఫ్ పబ్లిసిటీ` చట్టాలు స్పష్టంగా లేకపోవడం వల్ల మరణానంతరం ఈ డిజిటల్ హక్కులు ఎవరికి చెందుతాయనే వివాదాలు తీవ్రమవుతున్నాయి.
ఈ ఏఐ ముప్పును నిరసిస్తూ హాలీవుడ్లో SAG-AFTRA యూనియన్ సుదీర్ఘ సమ్మె చేసి, డిజిటల్ స్కాన్లను వాడాలంటే ప్రతిసారి స్పష్టమైన అనుమతి - ప్రత్యేక పారితోషికం పొందాలని కీలక నిబంధనలు సాధించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో `డిజిటల్ హక్కుల నిర్వహణ` సరికొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. టెక్నాలజీ పరంగా పురోగతిని ఆహ్వానిస్తూనే, పరిశ్రమలో అట్టడుగున ఉన్న జూనియర్ ఆర్టిస్టులు, డబ్బింగ్, స్టంట్, లైట్ మేన్ల సంక్షేమాన్ని కాపాడుతూ ఏఐ వాడకంలో పారదర్శకత, నైతిక పరిమితులు పాటించినప్పుడే ఇది సినీ రంగానికి సుదీర్ఘకాలం వరంగా నిలుస్తుంది.